అక్షరటుడే, వెబ్డెస్క్: Jallikattu | జల్లికట్టు వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఎడ్లు దూసుకురావడంతో పలువురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
సంక్రాంతి వచ్చిందంటే తమిళనాడులో (Tamil Nadu) సంప్రదాయ జల్లికట్టు సందడి సాగుతోంది. ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో (Chittoor district) సైతం జల్లికట్టు వేడుకలు ఏటా నిర్వహిస్తారు. ఈ క్రమంలో శుక్రవారం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్త శానంబట్లలో జల్లికట్టు వేడుకలు జరిగాయి. పెద్ద సంఖ్యలో యువకులు ఇందులో పాల్గొనగా.. వారి మీదకి పోట్ల గిత్తలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. దీంతో ఒకరి చెయ్యి విరిగిపోగా, మరొకరి తలకి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. పలువురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే తిరుపతిలోని (Tirupati) రుయా ఆసుపత్రికి తరలించారు.
Jallikattu | ప్రారంభం రోజే..
శానంభట్లలో శుక్రవారం జల్లికట్టు వేడుకలు (Jallikattu celebrations) ప్రారంభం అయ్యాయి. అయితే తొలిరోజే అపశృతి చోటు చేసుకొని పలువురు గాయపడ్డారు. జల్లికట్టు అంటే ఇరుకైన వీధుల్లో యువకులు అటు ఇటు నిలబడి ఉంటారు. మధ్యలో నుంచి ఎడ్లను పరిగెత్తిస్తారు. వాటిని లొంగదీసుకున్న వారిని విజేతలుగా ప్రకటిస్తారు. సంప్రదాయంగా వస్తున్న ఈ క్రీడలో యువకులు ఉత్సాహంగా పాల్గొంటారు. గతంలో స్థానికంగా ఉన్న పశువులతో వేడుకలు నిర్వహించేవారు. అయితే రెండు మూడేళ్లుగా ఇతర రాష్ట్రాల నుంచి కోడె గిత్తలను తీసుకు వస్తున్నారు. ఈ ఏడాది కూడా సుమారు 200 పరుస పశువులను తీసుకువచ్చారు. దీంతోనే ప్రమాదాలు జరుగుతున్నట్లు గ్రామ పెద్దలు చెబుతున్నారు. వేడుకల వేళ జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.