అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR | గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ ఆధ్వర్యంలో నాటిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణలో రేవంత్ పాలనపై నాటకం ప్రదర్శించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పోటీ పడి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో అనుముల రాజ్యాంగం నడుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) తుక్కుగూడలో ఇచ్చిన న్యాయ పత్రం అన్యాయ పత్రంగా మారిందని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా చట్టం చేస్తామన్న రాహుల్ గాంధీ వెనకనే ఫిరాయింపుదారులు ఉన్నారని ఎద్దేవా చేశారు.
KTR | ప్రభుత్వమే బాధ్యత వహించాలి
కోదాడలో కర్ర రాజేష్ లాకప్ డెత్‌కు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజేష్ దళితుడు కావడమే ఆయన చేసుకున్న పాపం అయిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy) ‘జెండా గద్దెలు కూల్చండి’ అంటూ ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను, రాజ్యాంగ విలువలను ఆయన పాతి పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి పాలన ప్రజాపాలన కాదు, రాజ్యాంగాన్ని పరిహసిస్తున్న రాక్షస పాలన అన్నారు.
KTR | గవర్నర్‌ను కలవనున్న బీఆర్ఎస్
కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) మంగళవారం గవర్నర్‌ను కలవనున్నారు. సింగరేణి కుంభకోణంపై వివరాలు ఆయన అందించనున్నారు. ఈ స్కామ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), ఇతర మంత్రుల పాత్రపై ఫిర్యాదు చేయనున్నారు. ఈ భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరనున్నారు.