అక్షరటుడే, డిచ్పల్లి: Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాలపై తక్షణమే దర్యాప్తు చేయించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో (Prajavani) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి (Collector Vinay Krishna Reddy) వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీలో 2012లో జరిగిన అక్రమ నియమకాలను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు (High Court) తీర్పు ఇచ్చిందన్నారు. అయినప్పటికీ తీర్పును ఉల్లంఘిస్తూ.. జడ్జిమెంట్ కాపీ తమకు అందలేదనే సాకుతో అక్రమంగా నియమితులైన వారిని కొనసాగించడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వీసీపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.
Telangana University | తెయూలో అక్రమ నియామకాలు..
తెలంగాణ యూనివర్సిటీలో 2012లో అప్పటి వీసీ, రిజిస్ట్రార్ ఎలాంటి నియమ, నిబంధనలు పాటించకుండా దొడ్డిదారిన తమకు నచ్చిన వ్యక్తులకు నియమక పత్రాలు అందజేశారని రాజుగౌడ్ ఆరోపించారు. ఈ అక్రమ నియామకాలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా విచారించిన కోర్టు ఈ నియామకాలు అక్రమంగా జరిగినట్లు తేల్చి వాటిని రద్దు చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ ఉత్తర్వులపై చర్యలు తీసుకోవాల్సిన వీసీ అక్రమంగా నియమితులైన వారిని అవే స్థానాల్లో కొనసాగిస్తూ జీతాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
Telangana University | వీసీ అండదండలోనే..
ప్రస్తుత తెయూ వీసీ, అధికారుల అందడండలతోనే వర్సిటీలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని రాజుగౌడ్ ఆరోపించారు. అవినీతికి అడ్డాగా తెలంగాణ యూనివర్సిటీ మారిందని, అధికారులు అక్రమార్జనే ధ్యేయంగా పనిచేస్తూ యూనివర్సిటీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాంత విద్యార్థులకు ఉపయోగపడాలని ఒక మంచి దృక్పథంతో, నాటి విద్యార్థి సంఘాల పోరాట ఫలితంగా తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడిందన్నారు. కానీ అధికారుల అవినీతి కారణంగా యూనివర్సిటీ ప్రతిష్ట భ్రష్టుపట్టిందని ఆయన వాపోయారు.
అవినీతి అధికారులకు అండదండలు అందిస్తున్న యూనివర్సిటీ అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమ నియామకాలకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, దుర్వినియోగమైన రూ.కోట్లల్లో నిధులను రికవరీ చేయాలన్నారు. బాధ్యులను పూర్తిగా సర్వీసు నుంచి రిమూవ్ చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో నాయకులు డి.నాగరాజు, జవారి రాహుల్, ఆర్.రాజన్న, బి.రవీందర్ గౌడ్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.