అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IDPL Lands | రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలోని బాలానగర్‌లో గల ఐడీపీఎల్ భూములపై విచారణకు ఆదేశించింది.కూకట్పల్లిలోనిసర్వేనంబర్ 376లో గల భూములపై విచారణ చేపట్టాలని విజిలెన్స్ ఆదేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ భూముల విలువ రూ.4 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఈ భూముల కబ్జాపై ఇటీవల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) , కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరసర్ప ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే. ఐడీపీఎల్‌లో కవిత భర్తకు భూములు ఎక్కడివని మాధవరం ప్రశ్నించారు. కృష్ణారావు కుమారుడి కంపెనీ ఈ భూములను ఆక్రమించిందని కవిత ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
IDPL Lands | స్పందించిన కవిత
ఐడీపీఎల్ భూములపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంపై కవిత స్పందించారు. తెలంగాణ జాగృతి పోరాటాలతోనే ఐడీపీఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణకు ఆదేశించారని పేర్కొన్నారు. ఇది తెలంగాణ జాగృతి విజయం అన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా (Medchal District) పర్యటన సందర్భంగా ఐడీపీఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణల విషయాన్ని ప్రజలు తన దృష్టికి తెచ్చారని తెలిపారు. ఈ విషయాలనే తాను మీడియా ముఖంగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడంతో విచారణకు ఆదేశించిందన్నారు. విచారణలో నిజం తేలుతుందని, తన కుటుంబంపై ప్రత్యర్థులు చేసిన ఆరోపణలు కూడా తేలిపోతాయని చెప్పారు.
IDPL Lands | వివాదం ఏమిటంటే?
నగరంలోని బాలానగర్, కూకట్పల్లి (Kukatpally) ప్రాంతాలకు చెందిన 891 ఎకరాల స్థలంలో ఐడీపీఎల్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ డ్రగ్స్ తయారీ సంస్థ నగరంలో 1967లో ప్లాంట్‌ను ప్రారంభించింది. ఇక్కడ 47 ఔషధాలు తయారు చేసేవారు. అయితే ప్లాంట్‌లో 1996 నుంచి బల్క్‌డ్రగ్, 2003 నుంచి ఫార్ములేషన్ల తయారీ ఆపేశారు. 2003లో ప్లాంట్ మూత పడింది. హైదరాబాద్‌లో భూముల ధరలకు రెక్కలు రావడంతో కొందరు అక్రమార్కుల కన్ను ఈ భూములపై పడింది. ఇప్పటికే ఐడీపీఎల్ భూముల్లో చాలా ఎకరాలు కబ్జా అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.