అక్షరటుడే, వెబ్‌డెస్క్: Meghalaya explosion | మేఘాలయలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బొగ్గు గనిలో పేలుడు (coal mine explosion) సంభవించడంతో 16 మంది చనిపోయారు.
మేఘాలయలోని (Meghalaya) తూర్పు జైంటియా హిల్స్ జిల్లాలోని అక్రమ బొగ్గు గనిలో గురువారం పేలుడు జరిగినట్లు డీజీపీ ఐ నోంగ్రాంగ్ తెలిపారు. థాంగ్స్కు ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని, రెస్క్యూ బృందాలు సెర్చ్ ఆపరేషన్ (search operation) నిర్వహిస్తున్నాయని డీజీపీ తెలిపారు. ఇప్పటివరకు 16 మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీవాయి. కానీ పేలుడు సమయంలో గని లోపల ఎంతమంది ఉన్నారో ఖచ్చితమైన వివరాలు తెలియరాలేదు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.
Meghalaya explosion | బొగ్గు తవ్వకాల సమయంలో..
ఈ ప్రమాదంలో గాయపడిన ఒకరిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, మెరుగైన చికిత్స కోసం షిల్లాంగ్‌కు తరలించారు. బొగ్గు తవ్వకాల సమయంలో పేలుడు సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ గనిని చట్ట విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రాట్ హోల్ మైనింగ్
గతంలో మేఘాలయాలో రాట్ హోల్ మైనింగ్ చేపట్టేవారు. మనిషి పట్టే అంత రంధ్రం చేసి అందులో నుంచి బొగ్గు తీసేవారు. ఎలుక చేసినట్లు రంధ్రం చేయడంతో దీనిని రాట్ హోల్ మైనింగ్ అంటారు. పర్యావరణ నష్టం, భద్రతా ప్రమాదాలను పేర్కొంటూ 2014లో మేఘాలయలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) రాట్-హోల్ బొగ్గు తవ్వకం, ఇతర అశాస్త్రీయ మైనింగ్ పద్ధతులపై నిషేధం విధించింది. అయినా కూడా అక్కడ చట్టవిరుద్ధంగా మైనింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా పేలుడు చొటుచేసుకొని 16 మంది చనిపోయారు.