అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | జూబ్లీహిల్స్లో జరుగుతున్న ఎన్నిక పార్టీలు, వ్యక్తుల మధ్య జరుగుతున్న ఎన్నిక కాదని.. పదేండ్ల అభివృద్ధి, పాలనకి.. రెండు సంవత్సరాల అరాచక పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)అన్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో (Jubilee Hills by Election)బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత బుధవారం తొలి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ , పద్మారావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ దాఖలు అనంతరం కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల రైతుబంధు పాలనకు, రెండు సంవత్సరాల రాక్షస పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నికగా పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారని.. ఆమె గెలుపుతోనైనా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.2500 ఇస్తుందని ఆశిస్తున్నారన్నారు.
KTR | కాంగ్రెస్ ఓడితేనే హామీల అమలు..
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ తెలిపారు. గద్దెనెక్కాక హామీలు అమలు చేయకుండా మోసగించిందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడగొడితేనే హామీలు అమలవుతాయన్నారు. జూబ్లీహిల్స్లో ఓటమి తర్వాతే కాంగ్రెస్ హామీలను అమలు చేస్తుందన్నారు. తమ ఇళ్లు కూలగొట్టిన అరాచకాలను చూసిన తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని, ఆ అరాచకాలు ఆగాలని హైదరాబాద్ (Hyderabad)నగర పేదలు కోరుకుంటున్నారన్నారు. మూతపడుతున్న బస్తీ దావఖానాలు, ఉచిత తాగునీరు ఆగిపోతున్న వైనాన్ని ప్రజలందరూ చూస్తున్నారని తెలిపారు. హైదరాబాద్లో ఒక్క ఇల్లు కూడా కట్టని కాంగ్రెస్ పార్టీ.. పేదల ఇళ్లను కూలగొడుతోందన్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన మైనార్టీలకు ఈ ఎన్నిక ఒక అవకాశంగా భావిస్తున్నారని.. ప్రభుత్వంలో ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వకుండా దారుణంగా వారిని అవమానపరిచిన మైనార్టీలు, ఈ ఎన్నికను రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ఒక అవకాశంగా భావిస్తున్నట్లుగా చెప్పారు.
KTR | ఓడించేందుకు బీసీలు సిద్ధం..
తమకు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ (BC Declaration), రిజర్వేషన్లు అన్నీ మోసమని, ఈ అంశంలో గుణపాఠం చెప్పడానికి రాష్ట్రవ్యాప్తంగా బీసీలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. దళితబంధు, అభయహస్తం హామీలతో మోసపోయిన దళితులు కూడా ఆగ్రహంతో ఉన్నారన్నారు. కేసీఆర్ (KCR)ఆధ్వర్యంలో మరోసారి అధికారంలోకి రావడానికి, హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక పునాది కాబోతున్నదన్నారు. రాష్ట్రంలో గులాబీ పార్టీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కాబోతున్నదని.. అన్ని వర్గాల మద్దతుతో, సునీత ఘన విజయం సాధించబోతున్నారన్నారు. రెండు సంవత్సరాల ఈ విఫల కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరూ మా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.