అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Power Banks | విమాన ప్రయాణికులకు (air passengers) డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక సూచనలు జారీ చేసింది. ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్లలో పవర్ బ్యాంక్‌లు (power banks), విడి లిథియం బ్యాటరీలను నిల్వ చేయడాన్ని నిషేధించింది.
విమానంలో లిథియం బ్యాటరీలు పేలి మంటలు వ్యాపించిన ఘటనలు ఇటీవల చోటు చేసుకున్నాయి. దీంతో డీజీసీఏ డేంజరస్ గూడ్స్ అడ్వైజరీ సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం పవర్ బ్యాంక్‌లను హ్యాండ్ బ్యాగేజీలో మాత్రమే తీసుకెళ్లవచ్చు. ప్రపంచవ్యాప్తంగా లిథియం బ్యాటరీలు వేడెక్కడం, మంటలు చెలరేగడం వంటి సంఘటనల తర్వాత, విమానాల సమయంలో ఫోన్‌లు లేదా ఇతర గాడ్జెట్‌లను ఛార్జ్ చేయడానికి పవర్ బ్యాంక్‌లను ఉపయోగించడాన్ని నిషేధించింది.
Power Banks | వాటికి నో ఎంట్రీ
తాజా నిబంధనల ప్రకారం ప్రయాణికులు ఇకపై తమ పవర్ బ్యాంక్‌లను విమానం సీటు పవర్ సాకెట్‌లకు కనెక్ట్ చేయడానికి అనుమతి లేదు. విమాన ప్రయాణానికి 100 వాట్-అవర్స్ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న పవర్ బ్యాంకులు మాత్రమే అనుమతిస్తారు. 27,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న పవర్ బ్యాంకులను విమానంలో తీసుకెళ్లడానికి వీలు లేదు. పవర్ బ్యాంకులు, పోర్టబుల్ ఛార్జర్‌లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లలో ఉండే లిథియం బ్యాటరీలు వేడెక్కడం, మంటలు అంటుకోవడం, పేలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీంతో డీజీసీఏ తాజాగా వాటిని నియంత్రణకు ఆదేశాలు జారీ చేసింది.