అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Air India | ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. విమానం గాలిలో ఉండగా ఓ ఇంజిన్ ఆగిపోయింది. దీంతో అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) చేశారు.
ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం రైట్ ఇంజిన్‌లో ఇంజిన్ ఆయిల్ (Engine Oil) ప్రెజర్ జీరోకు పడిపోయింది. దీంతో పైలెట్లు విమానాన్ని తిరిగి ఢిల్లీ ఎయిర్ పోర్టు (Delhi Airport)లో ల్యాండ్ చేశారు. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారు.ఎయిర్ ఇండియా బోయింగ్ 777 ప్యాసింజర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి రావాల్సి వచ్చింది.
Air India | ముందు జాగ్రత్తగా..
ఫ్లైట్ AI887 తెల్లవారుజామున ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Indira Gandhi International Airport) నుంచి బయలుదేరింది. గాల్లోకి ఎగిరిన వెంటనే పైలెట్లు రైట్ ఇంజిన్‌పై చమురు ప్రెజర్ అకస్మాత్తుగా తగ్గడాన్ని గమనించారు. వెంటనే కాక్‌పిట్‌లో ఆటోమేటెడ్ హెచ్చరికలు వచ్చాయి. ప్రతిస్పందనగా, సిబ్బంది ఏర్పాటు చేసిన భద్రతా విధానాలను అనుసరించి, ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని తిరిగి ఢిల్లీలో ల్యాండ్ చేశారు. దాదాపు గంట సేపు గాలిలో చక్కర్లు కొట్టిన విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
భద్రతపై ఎటువంటి రాజీ పడలేదని, నిర్వహణ బృందాల ద్వారా సమగ్ర సాంకేతిక తనిఖీ కోసం విమానాన్ని సర్వీసు నుంచి తొలగించామని ఎయిర్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. ముంబైకి వెళ్లే ప్రత్యామ్నాయ విమానాలలో ప్రయాణికులకు పంపించడానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.