అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Lionel Messi | ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో ఊహించని వివాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ ప్రవర్తనపై మెస్సీ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మెస్సీతో సెల్ఫీలు దిగే ప్రయత్నంలో ఆమె వ్యవహరించిన తీరు అగౌరవంగా ఉందంటూ సోషల్ మీడియాలో (Social Media) విమర్శల వర్షం కురుస్తోంది. వివరాల్లోకి వెళితే మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా లియోనెల్ మెస్సీ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Government) ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన “ప్రాజెక్ట్ మహాదేవ” అనే ఫుట్‌బాల్ అభివృద్ధి కార్యక్రమాన్ని మెస్సీ అధికారికంగా ఆవిష్కరించారు. ఈ ఈవెంట్‌కు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
Lionel Messi | సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ
అయితే ఈ కార్యక్రమం సందర్భంగా అమృత ఫడ్నవీస్ (Amruth Fadnavis) ప్రవర్తన వివాదానికి దారి తీసింది. మెస్సీతో పదేపదే సెల్ఫీలకు ప్రయత్నించడం, చూయింగ్ గమ్ నములుతూ ఫొటోలకు పోజులివ్వడం వంటివి అక్కడున్న వారిని అసహనానికి గురిచేశాయని వీడియోల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు, మెస్సీ పక్కన నిలబడేందుకు ఫుట్‌బాలర్ రోడ్రిగో డి పాల్‌ను పక్కకు జరగమని ఆమె కోరినట్లు సోషల్ మీడియాలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో మెస్సీ అభిమానులు మండిపడుతున్నారు.
వీడియో వైరల్ అయిన వెంటనే నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. “ఇది అధికారిక ఈవెంట్… వ్యక్తిగత సెల్ఫీలకు వేదిక కాదు”, “లెజెండరీ ఆటగాడి పట్ల ఇంత అగౌరవమా?”, “మైదానంలో ఆమె పాత్ర ఏమిటి?” అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. అనంతరం అమృత ఫడ్నవీస్ మెస్సీతో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) పోస్ట్ చేయడంతో అక్కడ కూడా వ్యంగ్య వ్యాఖ్యలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా, మెస్సీ భారత పర్యటన మొత్తం చిన్నచిన్న వివాదాలు, చర్చలకు దారి తీస్తోంది. కోల్‌కతాలో నిర్వహణా లోపాలపై విమర్శలు ఎదురుకాగా, హైదరాబాద్‌లో మాత్రం ఏర్పాట్లు బాగా ఉన్నాయని ప్రశంసలు దక్కాయి. తాజాగా ముంబైలో జరిగిన ఈ సెల్ఫీ వివాదంతో మెస్సీ పర్యటన మరోసారి వార్తల్లో నిలిచింది. ఫుట్‌బాల్ అభిమానులు మాత్రం ఇలాంటి ఘటనలు లెజెండరీ ఆటగాడి పర్యటనను తేలికగా మార్చకూడదని అభిప్రాయపడుతున్నారు.