అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Amit Shah | కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. దేశంలో అత్యంత ఎక్కువ కాలం హోంమంత్రి(Home Minister)గా పనిచేసిన వ్యక్తిగా ఆయన రికార్డులకెక్కారు. అలాగే, రెండో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ షా హోంమంత్రిగా మంగళవారంతో 2,258 రోజులు (6 సంవత్సరాల 65 రోజులు) పూర్తి చేసుకున్నారు. గతంలో ఈ రికార్డు బీజేపీ కురు వృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ పేరిట ఉండేది. ఆయన 2,256 రోజులు (6 సంవత్సరాల 64 రోజులు) కేంద్ర హోం మంత్రిగా దేశానికి సేవలందించారు.
Amit Shah | అత్యంత శక్తిగా..
అతి సామాన్యంగా ప్రారంభమైన అమిత్ షా(Amit Shah) రాజకీయ ప్రయాణం ఇప్పుడు దేశంలోనే అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన రెండో వ్యక్తిగా ఎదిగే స్థాయికి చేరింది. తన రాజకీయ చతురత, ఎత్తుగడలతో ప్రత్యర్థులను మట్టి కరిపించడంలో ఆయనకు ఎవరూ సాటి లేరు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi)కి కుడి భుజంగా మారిన షా.. బీజేపీ వరుస విజయాల్లో ఎనలేని పాత్ర పోషించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన నాయకత్వంలోనే 2014 లోక్‌సభ ఎన్నికల్లో(2014 Lok Sabha Elections) ఘన విజయం సాధించి పెట్టారు.
Amit Shah | సామాన్యుడిగా మొదలై..
గుజరాత్(Gujrat)కు చెందిన కుసుంబెన్, అనిల్‌చంద్ర షా దంపతులకు కుమారుడైన అమిత్ షా అక్టోబర్ 22, 1964న ముంబైలో జన్మించారు. గుజరాత్‌లోని మాన్సాలోని తన పూర్వీకుల గ్రామంలో 16 సంవత్సరాల పాఠశాల విద్యను పూర్తి చేసిన అనంతరం కుటుంబంతో కలిసి అహ్మదాబాద్‌కు వలస వెళ్లారు. చిన్నప్పటి నుంచీ నిత్య పాఠకుడు అయిన ఆయన.. జాతీయ వ్యక్తుల జీవిత చరిత్రల నుంచి ఎంతో ప్రేరణ పొందారు. ఈక్రమంలోనే ఆయన రాజకీయాల వైపు అడుగు వేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సందర్భోచితంగా వ్యవహరిస్తూ దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారు.
Amit Shah | ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగి..
అమిత్ షాది ఆర్ఎస్ఎస్(RSS) నేపథ్యం. తన 16 ఏళ్ల వయస్సులో 1980లో స్వయంసేవక్ గా ఆయన ప్రస్తానం మొదలైంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(National Swayamsevak Sangh) లో చేరిక ద్వారా ఆయన రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) కార్యకలాపాల్లో చేరారు. 1989లో బీజేపీ అహ్మదాబాద్ నగర కార్యదర్శిగా నియమితుడు కావడం ఆయన రాజకీయ ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలిచింది. అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ వంటి ప్రముఖులకు ప్రధాన ప్రచారకర్తగా, ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం వంటి కీలక పాత్రలను చేపట్టడంతో ఆయన ప్రభావం పెరుగుతూ వచ్చింది.
Amit Shah | అపర చాణక్యుడు..
ఎన్నికల వ్యూహాలు రచించడంలో అమిత్ షాను అపర చాణక్యుడిగా పేర్కొంటారు. రాజకీయంగా ఎదుగుతున్న క్రమంలో షా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 2010లో జరిగిన ఒక హైప్రొఫైల్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసు(Fake Encounter Case)లో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. ఆ తర్వాత అమిత్ షా వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2014లో 49 ఏళ్ల వయసులో భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party)కి అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా షా ఎన్నికయ్యారు. తరువాత 2019లో 54 ఏళ్ల వయసులో కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అతి పిన్న వయస్కుడైన కేంద్ర హోం మంత్రిగా నిలిచారు.
Amit Shah | హోం మంత్రిగా కీలక నిర్ణయాలు..
కేంద్ర హోం మంత్రిగా ఎక్కువ కాలం పని చేసిన అమిత్ షా దేశ చరిత్రలో నిలిచిపోయే ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370 రద్దు ఆయన రాజకీయ కీర్తి కిరీటంలో అతిపెద్ద నిర్ణయంగా నిలిచిపోయింది. హోం మంత్రిగా ఆయన నేతృత్వంలోనే జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలు 70 శాతానికి పైగా తగ్గుముఖం పట్టాయి. ఇక, అమిత్ షా నేతృత్వంలోనే కీలకమైన పౌరసత్వ సవరణ చట్టం (CAA) ఆమోదం పొందింది. అలాగే, ట్రిపుల్ తలాక్ రద్దు. యూనిఫాం సివిల్ కోడ్ (UCC) ప్రారంభం వెనుక కూడా ఆయన పాత్ర అత్యంత కీలకం. అలాగే, భారతీయ న్యాయ సంహిత (BNS) 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) 2023, భారతీయ సాక్ష్య అధికారియం (BSA) 2023 అనే మూడు చారిత్రక చట్టాలను ప్రవేశపెట్టడంలో అమిత్ షా కీలక పాత్ర పోషించారు. ఇవి వలసరాజ్యాల కాలం నాటి భారతీయ శిక్షాస్మృతి (IPC), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) మరియు భారతీయ సాక్ష్య చట్టాన్ని వరుసగా భర్తీ చేశాయి. దేశంలో అంతర్గత సమస్యలను నియంత్రించడంలో హోం మంత్రిగా ఆయన పూర్తిగా విజయవంతమయ్యారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న నక్సలైట్ల సమస్యను అమిత్ షా దాదాపు అణచి వేశారు. వచ్చే మార్చి వరకు దేశంలో నక్సల్స్ లేకుండా చేస్తానని ప్రతిన బూనిన ఆయన ఇప్పటికే ఆ దిశగా విజయం సాధించారు.