HomeతెలంగాణMP Arvind | 29న అమిత్​ షా రాక.. పసుపు బోర్డుతో కొత్త శకం ఆరంభం..:...

MP Arvind | 29న అమిత్​ షా రాక.. పసుపు బోర్డుతో కొత్త శకం ఆరంభం..: ఎంపీ అర్వింద్​

- Advertisement -


అక్షరటుడే, వెబ్​డెస్క్ : MP Arvind | కేంద్ర హోం మంత్రి అమిత్​ షా(Union Home Minister Amit Shah)​ ఈ నెల 29న నిజామాబాద్​ వస్తున్నట్లు ఎంపీ అర్వింద్ తెలిపారు. సోమవారం ఆయన నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లావాసుల చిరకాల వాంఛ అయిన జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని అమిత్​ షా ప్రారంభిస్తారని ఎంపీ తెలిపారు.

పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇక్కడి నుంచి కొత్తశకం మొదలు అవుతుందన్నారు. అదే రోజు రైతు సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. పాలిటెక్నిక్​ గ్రౌండ్(Polytechnic Ground)​లో జరిగే ఈ కార్యక్రమానికి వేలాది మంది రైతులు తరలి వస్తారు. 2019 పార్లమెంట్​ ఎన్నికల్లో పసుపు బోర్డు కోసం పోటీ చేసిన అభ్యర్థులు ఇతర పసుపు రైతులను తీసుకొని తరలిరావాలని ఆయన కోరారు.

MP Arvind | డీఎస్​ విగ్రహావిష్కరణ

అమిత్​ షా ఇందూర్​లో పర్యటించే రోజే తన తండ్రి డి శ్రీనివాస్​ ప్రథమ వర్ధంతి అని ఎంపీ అర్వింద్​ (MP Arvind)​అన్నారు. డీఎస్​ విగ్రహాన్ని నగరంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా తాను డీఎస్​ విగ్రహాన్ని(DS statue) తయారు చేయించానని చెప్పారు. ఆ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ విగ్రహాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా చేతుల మీదుగా ప్రారంభిస్తారని ఎంపీ తెలిపారు. అనంతరం పాలిటెక్నిక్​ గ్రౌండ్​లో జరిగే రైతు సమ్మేళనంలో ఆయన మాట్లాడుతారన్నారు.

MP Arvind | జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలి

జిల్లాకు మంత్రి పదవి కేటాయించకపోవడంపై ఎంపీ అర్వింద్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా నుంచే ఎన్నో ఉద్యమాలు ప్రారంభం అయ్యాయని ఆయన గుర్తు చేశారు. అలాంటిది జిల్లాకు మంత్రి వర్గం(Cabinet)లో చోటు దక్కకపోవడం మంచి పరిణామం కాదన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న పసుపు బోర్డు కార్యాలయం తాత్కాలికమని ఎంపీ తెలిపారు. జిల్లా పరిషత్​ కార్యాలయం వెనక ఉన్న రెండు ఎకరాల స్థలాన్ని పసుపు బోర్డు కోసం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. అక్కడ స్థలం కేటాయిస్తే శాశ్వత భవనం నిర్మిస్తామని తెలిపారు.

MP Arvind | కేసీఆర్​ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్​ కుటుంబంపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR)​ కాళేశ్వరం అక్రమాల కేసులో, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను లిక్కర్​ స్కామ్​(Liquor scam)లో, కేటీఆర్(KTR)​ను ఫోన్​ ట్యాపింగ్​ కేసు(Phone Tapping Case)లో జైలులో వేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు మూడు సీట్లు మాత్రమే వస్తాయన్నారు. కేసీఆర్​ పోటీ చేయరని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) కేసీఆర్​ కుటుంబాన్ని చట్ట ప్రకారం అరెస్ట్​ చేయకపోతే ఆయన రాజకీయ జీవితం భూస్థాపితం అవుతుందన్నారు.

MP Arvind | ఫోన్​ ట్యాపింగ్​ కేసు సీబీఐకి అప్పగించాలి

ఫోన్​ ట్యాపింగ్​ కేసును సీబీఐ(CBI)కి అప్పగించాలని ఎంపీ డిమాండ్​ చేశారు. ఎంతో మంది ఫోన్లను ట్యాప్​ చేశారన్నారు. ఈ విషయంలో రేవంత్​రెడ్డి సరైన చర్యలు చేపట్టడం లేదన్నారు. కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్​(Bandi Sanjay) స్పందించి సీబీఐ విచారణకు చర్యలు తీసుకోవాలన్నారు.

సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, న్యాలం రాజు, స్రవంతి రెడ్డి, పోతన్కర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.