అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Amit Shah Naxal meeting | కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) నక్సలిజంపై ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో అధికారులతో పలు అంశాలపై ఆయన చర్చించారు.
దేశంలో మార్చి 31 వరకు నక్సలిజం లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి మరో 50 రోజులు మాత్రమే గడువు ఉండటంతో అమిత్ షా అధికారులతో సమీక్షించారు. 50 రోజుల కార్యాచరణ ప్రణాళిక గురించి చర్చించారు. నక్సల్ నెట్‌వర్క్‌లను నిర్మూలించడం, నక్సలైట్ల లొంగిపోవడాన్ని ప్రోత్సహించడం, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు. బస్తర్‌ను అభివృద్ధి చెందిన గిరిజన విభాగంగా మార్చాలన్నారు.
Amit Shah Naxal meeting | ఆపరేషన్ కగార్తో..
దేశంలో మావోయిజాన్ని లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ (Operation Kagar) చేపట్టింది. ఇందులో భాగంగా వేల సంఖ్యలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఆధునిక సాంకేతికతతో నక్సలైట్లకు కంచుకోటగా ఉన్న అడవులను సైతం బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లలో వందలాది మంది మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో వందలాది మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి లొంగిపోతున్నారు. ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో ఇప్పటికే మావోయిస్టు పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కొత్తగా రిక్రూట్మెంట్లు సైతం లేవు. దీంతో కేంద్రం మార్చి 31 లోపు లక్ష్యం చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది.
Amit Shah Naxal meeting | డబుల్ ఇంజిన్ సర్కార్‌తో..
ఒకప్పుడు నక్సలైట్ హింసకు నిలయంగా ఉన్న ఛత్తీస్‌గఢ్ బీజేపీ (BJP) డబుల్ ఇంజిన్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి పర్యాయపదంగా మారిందని అమిత్ షా అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇక్కడి యువత క్రీడలు, ఫోరెన్సిక్స్, సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. సోమవారం బస్తర్ పాండుమ్ (Bastar Pandum) కార్యక్రమానికి అమిత్ షా హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో రాయ్‌పూర్ నుంచి దంతేశ్వరి విమానాశ్రయానికి బయలుదేరుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బస్తర్ పాండుమ్ వేదికకు చేరుకుంటారు. బస్తర్ పాండుమ్ అంటే గిరిజన ఉత్సవం.