అక్షరటుడే, వెబ్‌డెస్క్: Amit Shah | తృణమూల్ కాంగ్రెస్ తీరుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం టీఎంసీ బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లను ప్రోత్సహిస్తోందని ఆక్షేపించారు.
Amit Shah | రాష్ట్ర ప్రభుత్వమే కారణం
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె నిర్మాణం పూర్తికాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే ప్రధాన కారణమని అమిత్ షా ఆరోపించారు. అవసరమైన భూమిని కేటాయించకపోవడం వల్ల కేంద్రం ఈ పనిని పూర్తి చేయలేకపోతున్నామని వివరించారు. చొరబాట్లు కేవలం బెంగాల్‌కు మాత్రమే పరిమితమైన సమస్య కాదని, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన ముప్పుగా మారిందని అన్నారు. దీని వల్ల దేశ సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Amit Shah | అధికారంలోకి సరిహద్దు భద్రత బలోపేతం
2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) జేబీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి రాగానే సరిహద్దు భద్రతను బలోపేతం చేసి, అక్రమ వలసలను పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అక్రమ చొరబాటుదారులను గుర్తించి రాష్ట్రం నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేశారు.
Amit Shah | హింసాత్మక రాజకీయాలకు నిలయం
టీఎంసీ (TMC) పాలనలో రాష్ట్రం హింసాత్మక రాజకీయాలు, అవినీతికి నిలయంగా మారిందని కేంద్ర హోం మంత్రి విమర్శించారు. వామపక్ష పాలన కంటే టీఎంసీ హయాంలో హింస, భయాందోళనలు మరింత పెరిగాయన్నారు. మమతా ప్రభుత్వ అవినీతి వల్ల గత 15 ఏళ్లుగా రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోయిందని ఆరోపించారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా స్థానిక ప్రజలకు చేరకుండా టీఎంసీ నాయకులు (TMC Leaders) అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Amit Shah | బీజేపీకి మద్దతు ఇవ్వాలి
రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులను మార్చాలంటే ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వాలని అమిత్ షా పిలుపునిచ్చారు. పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బెంగాల్‌ను మళ్లీ అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పారు.