Homeఅంతర్జాతీయంUS-China | అమెరికాది ద్వంద వైఖరి.. పోరాటాల‌కు భ‌య‌ప‌డబోమ‌న్న చైనా

US-China | అమెరికాది ద్వంద వైఖరి.. పోరాటాల‌కు భ‌య‌ప‌డబోమ‌న్న చైనా

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: US-China | సుంకాల మోత మోగించిన అమెరికాపై చైనా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేసింది. అమెరికా ద్వంద వైఖ‌రి అవ‌లంభిస్తోంద‌ని మండిప‌డిన డ్రాగ‌న్‌.. పోరాటాల‌కు తాము భ‌య‌ప‌డ‌బోమ‌ని తేల్చి చెప్పింది. అగ్ర‌రాజ్య అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) ఇటీవ‌ల చైనాపై 100 శాతం సుంకాలు విధించిన సంగ‌తి తెలిసిందే.

అన్ని చైనా దిగుమతులపై నవంబర్ 1 నుండి 100% సుంకాలు అమ‌లులోకి రానున్న నేప‌థ్యంలో డ్రాగ‌న్ ఆదివారం అమెరికాపై (America) తీవ్ర విమర్శలు చేసింది. అమెరికా ద్వంద్వ ప్రమాణాలను అవలంబిస్తున్నద‌ని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆరోపించింది. “సంబంధిత యూఎస్ ప్రకటన ద్వంద్వ ప్రమాణాలకు ఒక ఉదాహరణ. చైనాతో సర్దుకుపోవడానికి అధిక సుంకాల గురించి ఉద్దేశపూర్వకంగా బెదిరించడం సరైన మార్గం కాదని” తెలిపింది. “వాణిజ్య యుద్ధంపై (trade war) మా స్థానం స్థిరంగా ఉంది: మేము దానిని కోరుకోవడం లేదు, కానీ మేము వీటికి భయపడమని” స్ప‌ష్టం చేసింది.

US-China | బెదిరింపు సుంకాలు సరైనవి కావు.

అమెరికా చ‌ర్య‌లు చైనా ప్ర‌యోజ‌నాల‌కు తీవ్ర హాని క‌లిగిస్తాయ‌ని బీజింగ్ వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. “ఈ చర్యలు.. చైనా ప్రయోజనాలకు తీవ్రంగా హాని కలిగించాయి. రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య చర్చల వాతావరణాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి” అని పేర్కొన్నారు. చైనాతో చర్చలు జరపడానికి ప్రతి మలుపులోనూ అధిక సుంకాలతో బెదిరించడం సరైన విధానం కాదని మండిప‌డ్డారు.

అమెరికా ఘర్షణాత్మక వాణిజ్య వ్యూహాన్ని అవ‌లంబిస్తోంద‌ని విమర్శించారు. అరుదైన ఖనిజాలపై చైనా అసాధారణ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంతో ప్రతీకారంగా ఆ దేశంపై వంద శాతం టారిఫ్ విధిస్తున్న‌ట్లు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ప్ర‌క‌టించారు. ఇరు దేశాల మ‌ధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా ఈ నెల చివర్లో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో (China President Xi Jinping) జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసుకునే అవ‌కాశ‌ముంద‌ని పేర్కొన్నారు.

అయితే, అమెరికా చ‌ర్య‌ల‌ను చైనా ఖండించింది. తన ఎగుమతి నియంత్రణలను పూర్తిగా చట్టబద్ధమైనవని సమర్థించుకుంది. ప్రపంచ పారిశ్రామిక, సరఫరా గొలుసుల భద్రత, స్థిరత్వాన్ని కాపాడటానికి సహాయపడే లక్ష్యంతో పాటు ఇతర దేశాలతో ఎగుమతి నియంత్రణ విధానాలపై సహకారాన్ని పెంపొందించుకోవడానికి బీజింగ్ సిద్ధంగా ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.