అక్షరటుడే, వెబ్డెస్క్ : American singer | లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ (American singer Mary Milben) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ప్రధాని అయ్యే చాతుర్యం లేదని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ( Prime Minister Modi) రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన మేరీ మిల్బెన్ శుక్రవారం తీవ్రంగా స్పందించారు.
మోదీ నాయకత్వాన్ని తరచూ ప్రశంసించే మిల్బెన్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు (US President Donald Trump) భారత ప్రధాని భయపడుతున్నారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా విమర్శించారు. “మీరు (రాహుల్) తప్పు, ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్ కు భయపడరు. సుదీర్ఘమైన ఆటను పీఎం మోదీ అర్థం చేసుకుంటారు. అమెరికాతో ఆయన దౌత్యం వ్యూహాత్మకమైనది. @POTUS ఎల్లప్పుడూ అమెరికా ప్రయోజనాలను ముందు ఉంచినట్లే, ప్రధాని మోదీ కూడా భారతదేశానికి ఏది మంచిదో అదే చేస్తారు. నేను దానిని అభినందిస్తున్నాను. దేశాధినేతలు అదే చేస్తారు. వారు తమ దేశానికి ఏది మంచిదో అది చెబుతారు,” అని మిల్బెన్ Xలో పోస్ట్ చేశారు.
American singer | రాహుల్కు అర్హత లేదు..
రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల చేపట్టిన యాత్రలపైనా మిల్బెన్ విమర్శలు గుప్పించారు. ఇటీవల బీహార్లో నిర్వహించిన ఓటు అధికార యాత్ర, అంతకు ముందు చేపట్టిన భారత్ జోడో యాత్రలను ప్రస్తావిస్తూ.. రాహుల్ గాంధీ ఇక “ఐ హేట్ ఇండియా” పర్యటన చేపట్టాలని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి కావడానికి అవసరమైన అర్హతలు కాంగ్రెస్ నేతకు లేవని ఆమె ఎద్దేవా చేశారు. “మీరు ఈ రకమైన (మోదీ) నాయకత్వాన్ని అర్థం చేసుకుంటారని నేను ఆశించడం లేదు. ఎందుకంటే మీకు భారతదేశ ప్రధాని కావడానికి చతురత లేదు. మీ “ఐ హేట్ ఇండియా” పర్యటనకు తిరిగి రావడం ఉత్తమం ” అని ఆమె తన పోస్టులో విమర్శలు గుప్పించారు.