Homeఅంతర్జాతీయంAmerica | వర్క్‌ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ రద్దు చేసిన అమెరికా.. భారతీయులపై తీవ్ర ప్రభావం

America | వర్క్‌ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్‌ రద్దు చేసిన అమెరికా.. భారతీయులపై తీవ్ర ప్రభావం

అమెరికా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వలసదారుల వర్క్‌ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్​ విధానాన్ని రద్దు చేసింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : America | అమెరికా (America) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వలస కార్మికుల వర్క్​ పర్మిట్ల ఆటోమేటిక్​ రెన్యువల్​ విధానాన్ని రద్దు చేసింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (Department of Homeland Security) ప్రకటన విడుదల చేసింది.

అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదారులపై ట్రంప్​ (Donald Trump) కఠిన చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. మొదట్లో అక్రమ వలసదారులపై ఆయన ఉక్కుపాదం మోపారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించి వారి దేశాలకు పంపించారు. అనంతరం ఆయన వలసదారులపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే హెచ్​–1బీ వీసా (H-1B Visa) ఫీజు భారీగా పెంచిన ట్రంప్​ తాజాగా.. ఉపాధి అధికార పత్రాల (EAD) యొక్క ఆటోమేటిక్ పొడిగింపును నిలిపి వేశారు. వేలాది మంది విదేశీ ఉద్యోగులపై దీని ప్రభావం పడనుంది. అందులో ఎక్కువ మంది ప్రవాస భారతీయులు ఉంటారు.

America | ఈ రోజు నుంచే..

ఈ ఏడాది అక్టోబర్ 30 (గురువారం) లేదా ఆ తర్వాత తమ EADని పునరుద్ధరించడానికి దాఖలు చేసే విదేశీయులు ఆటోమేటిక్ పొడిగింపును పొందరు అని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ పేర్కొంది. అక్టోబర్ 30కి ముందు స్వయంచాలకంగా పొడిగించబడిన వర్క్​ పర్మిట్లు ప్రభావితం కావు. కొత్త నిబంధనతో ప్రజా భద్రత, జాతీయ భద్రతను కాపాడటానికి తనిఖీ మరియు స్క్రీనింగ్ ఎక్కువగా ఉంటుంది అని తెలిపింది.

America | తీవ్ర ప్రభావం..

బైడెన్​ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో వర్క్ పర్మిట్ (Work Permit) గడువు ముగిసిన తర్వాత కూడా 540 రోజులు పని చేయడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆటోమేటిక్​గా వర్క్​ పర్మిట్​ రెన్యువల్​ అయ్యేది. తాజాగా విధానానికి ముగింపు పలుకుతూ ట్రంప్‌ సర్కారు కొత్త నిబంధనలు తీసుకు వచ్చింది. వర్క్​ పర్మిట్​ పొడిగింపు కోసం.. వలసదారులు ఇక నుంచి ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అధికారులు పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే.. వర్క్​ పర్మిట్ పొడిగిస్తారు. లేదంటే తిరస్కరిస్తారు. వలస కార్మికుల నేపథ్యాన్ని సమీక్షించడం కోసం ఈ నిబంధనకు అవసరమని US ప్రభుత్వం చెబుతోంది. తమ EAD గడువు ముగియడానికి 180 రోజుల ముందు పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆలస్యంగా దరఖాస్తు చేస్తే వారికే నష్టం వాటిల్లుతుందని, తాత్కాలికంగా పని అనుమతులను కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది.