అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bhatti Vikramarka | తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) అన్నారు. సీఎస్ఆర్ (CSR) నిధులతో త్వరలో మండలానికో అంబులెన్స్ సమకూరుస్తామని ఆయన తెలిపారు.
యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ (Yadadri Thermal Power Plant) కోసం భూములు ఇచ్చిన వారికి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది. మొత్తం 360 మందికి శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు హైదరాబాద్‌లో నియామకపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగాలతో పేదరికాన్ని జయించవచ్చని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఆ చట్టం ప్రకారం ఇప్పుడు నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు.
Bhatti Vikramarka | అంతర్జాతీయ ప్రమాణాలతో..
రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కూల్స్ (Young India Schools) నిర్మిస్తున్నట్లు భట్టి తెలిపారు. 25 ఎకరాల విస్తీర్ణంలో 2,600 మంది విద్యార్థులు చదువుకునేలా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అన్ని మండలాలకు అంబులెన్స్‌లు లేవని భట్టి తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి సీఎస్ఆర్ నిధులతో త్వరలో మండలానికో అంబులెన్స్ అందిస్తామన్నారు.
Bhatti Vikramarka | కరెంట్ ఉండదని ప్రచారం చేశారు
కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదని ప్రచారం చేశారని భట్టి విక్రమార్క అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఎనర్జీ పాలసీ తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. కరెంట్ పోకుండా చర్యలు చేపట్టామన్నారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని.. కరెంట్ అంటేనే కాంగ్రెస్ అని ఆయన అన్నారు. రైతులకు, 200లోపు యూనిట్లు వాడుతున్న ఇళ్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు. జనవరి వరకు యాదాద్రి పవర్‌ప్లాంట్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి ప్రజలకు అంకితం చేస్తామన్నారు.
Bhatti Vikramarka | వాళ్లు ఉద్యోగాలు ఇవ్వలేదు
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) ఉద్యోగాలు ఇవ్వలేదని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఉద్యోగాలు ఇస్తుంటే బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ పనితీరును చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.