అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ambati Rayudu | తెలుగు రాష్ట్రాల గర్వకారణం, టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు ఇంట్లో మరోసారి సంతోషాల పండగ వాతావరణం నెలకొంది. రాయుడు మూడోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య చెన్నుపల్లి విద్య తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.
ఈ శుభవార్తను అంబటి రాయుడు స్వయంగా తన సోషల్ మీడియా (Social Media) ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. భార్య, నవజాత శిశువుతో కలిసి ఉన్న ఒక ముచ్చటైన ఫోటోను షేర్ చేస్తూ, “Blessed with a baby boy” అంటూ ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు క్రికెట్ అభిమానులు, మాజీ సహచరులు, సినీ–రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Ambati Rayudu | రాయుడు కుటుంబంలో మూడో సంతానం
అంబటి రాయుడు, చెన్నుపల్లి విద్య 2009లో వివాహం చేసుకున్నారు. వీరి దాంపత్య జీవితానికి 2020 జూలైలో తొలి సంతానంగా కుమార్తె జన్మించింది. ఆ తర్వాత 2023లో రెండోసారి తండ్రిగా మారిన రాయుడికి మరో కూతురు పుట్టింది. ఇప్పుడు మూడోసారి తండ్రి అయిన రాయుడికి ఈసారి మగబిడ్డ పుట్టడంతో కుటుంబంలో ఆనందం రెట్టింపు అయింది. 2023 ఐపీఎల్ ఫైనల్ అనంతరం అంబటి రాయుడు అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తరపున ఆడిన రాయుడు మొత్తం ఆరు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుని అరుదైన రికార్డు నెలకొల్పారు. ముఖ్యంగా కీలక మ్యాచ్‌ల్లో ఆయన ఆడిన ఇన్నింగ్స్‌లు అభిమానులకు ఇప్పటికీ గుర్తుండిపోయాయి.
రిటైర్మెంట్ అనంతరం కొంతకాలం రాజకీయాల్లో యాక్టివ్‌గా కనిపించిన రాయుడు, ప్రస్తుతం తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అలాగే వివిధ లీగ్‌ల్లో మెంటార్‌గా, క్రికెట్ విశ్లేషకుడిగా కూడా తన అనుభవాన్ని పంచుకుంటున్నారు. తెలుగు క్రికెటర్లలో అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందిన అంబటి రాయుడు, మైదానంలో ఎంత దూకుడుగా ఉంటారో, వ్యక్తిగత జీవితంలో అంతే సాదాసీదాగా ఉంటారు. వ్యక్తిగత విషయాలను పెద్దగా బయటకు రానివ్వని రాయుడు, కుటుంబానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారని ఆయనకు దగ్గరైనవారు చెబుతుంటారు.