అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ambati Rambabu | ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేత అంబటి రాంబాబు మరియు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మధ్య ఉన్న రాజకీయ రగడ అంతా ఇంతా కాదు. మాటల తూటాలు, ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటూ పలుమార్లు వార్తల్లో నిలిచిన ఈ ఇద్దరూ, అనూహ్యంగా ఇప్పుడు స్నేహపూర్వకంగా కనిపిస్తున్నారు. ఇందుకు కారణం పవన్ నటించిన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. మూవీ రిలీజ్‌కు ముందు ఉద్రిక్త రాజకీయ వాతావరణంలో అంబటి రాంబాబు (Ambati Rambabu) ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్‌కి విషెస్ చెబుతుండడం ఇప్పుడు సంచలనంగా మారింది.
Ambati Rambabu | సెటైరికల్ ట్వీటా..!
“పవన్ కళ్యాణ్ గారి ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సూపర్ డూపర్ హిట్టై కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను! అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ అభిమానుల్లో ఇది ఉత్సాహం నింపగా, రాజకీయవర్గాల్లో మాత్రం “ఇది నిజమా?” అనే ఆశ్చర్యాన్ని రేపుతోంది. గతంలో పవన్ కళ్యాణ్‌పై అనేకసార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసిన అంబటి, ఈసారి మాత్రం వైఖరి మారినట్టు కనిపిస్తున్నారు. అంబటి అనుచరులు చెబుతున్నట్టే, ఇది ఒక వ్యక్తిగత అభిమానం కింద చేసిన ట్వీట్ కావచ్చునని, రాజకీయాలను సినిమా వేరు చేసి చూడడమే పెద్దతనమని భావిస్తున్నారు. అభిమాన హీరో చిత్రం విజయవంతం కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదంటూ సమర్థిస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్, నాగబాబులను ట్యాగ్ చేసి ట్వీట్ చేయడంతో ఇది సెటైరికల్ ట్వీట్ (Satirical tweet) అని కొందరు అంటున్నారు. ఏదిఏమైనా అంబటి చేసిన ఈ ట్వీట్ వైసీపీ నేతలలో కొందరిని ఖంగుతినేలా చేసింది. ఒకవైపు పవన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉండగా, మరోవైపు అంబంటి వైసీపీ పార్టీలో (YSRCP Party) ప్రముఖ నాయకుడిగా ఉన్నాడు. ఇద్దరి మధ్య గతంలో కోల్డ్ వార్ కూడా నడిచింది. ఈ నేపథ్యంలో అంబటి పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు చెప్పడం రాజకీయ పరంగా ఆసక్తి రేపుతుంది.