అక్షరటుడే, వెబ్‌డెస్క్: Amazon Layoffs | ప్రపంచంలోని అతిపెద్ద ఈ-కామర్స్, టెక్ కంపెనీలలో ఒకటైన అమెజాన్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించనుంది. తాజా నివేదికల ప్రకారం.. ఈసారి సుమారు 30,000 మందికి పైగా ఉద్యోగులను లేఆఫ్ చేయాలని సంస్థ నిర్ణయించినట్లు సమాచారం.
CNBC వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ లేఆఫ్స్ (Lay Offs)పై అధికారిక ప్రకటన ఇవాళ్టి నుంచే వెలువడే అవకాశం ఉంది. ఇది అమెజాన్ చరిత్రలోనే అత్యంత పెద్ద ఉద్యోగ కోతగా భావిస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ షాపింగ్ (Online Shopping) డిమాండ్ విపరీతంగా పెరగడంతో, అమెజాన్ పెద్దఎత్తున నియామకాలు చేపట్టింది.
Amazon Layoffs | భారీ లే ఆఫ్స్..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.54 మిలియన్లకు పైగా ఉద్యోగులు ఉన్న ఈ సంస్థలో, కేవలం కార్పొరేట్ విభాగంలోనే 3.5 లక్షల మంది పనిచేస్తున్నారు. అయితే, మహమ్మారి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆన్‌లైన్ డిమాండ్ తగ్గడం, గ్లోబల్ ఎకానమీ మందగమనం, పెరుగుతున్న ఆపరేటింగ్ ఖర్చులు అమెజాన్ వ్యాపారంపై (Amazon Business) తీవ్ర ఒత్తిడిని సృష్టించాయి. దీంతో సంస్థ మళ్లీ లాభదాయకతపై దృష్టి పెట్టి ఖర్చు తగ్గించే వ్యూహాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పలు విభాగాల్లో ప్రాజెక్టులను నిలిపివేయడం, ఆటోమేషన్ టెక్నాలజీని పెంచడం, AI, రోబోటిక్స్ ఆధారిత వర్క్‌ఫ్లోలను ప్రవేశపెట్టడం వంటి మార్పులు చేస్తున్నారు.
ఇండస్ట్రీ నిపుణుల ప్రకారం.. ఈ చర్యలు అమెజాన్ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగం. కానీ, ఉద్యోగుల పరంగా ఇది ఒక కఠిన దశగా భావిస్తున్నారు. ప్రపంచ టెక్ రంగంలో ఇప్పటికే గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, టెస్లా వంటి సంస్థలు భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు ప్రకటించాయి. ఇప్పుడు అమెజాన్ (Amazon) కూడా ఆ జాబితాలో చేరడం టెక్ రంగం ఎదుర్కొంటున్న మాంద్య పరిస్థితులకు సంకేతంగా చూస్తున్నారు. నిపుణుల అంచనా ప్రకారం, ఈ లేఆఫ్స్ ధోరణి తదుపరి సంవత్సరాల్లో మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

