అక్షరటుడే, వెబ్‌డెస్క్: Amazon | ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ఆర్థిక వ్యయాలను తగ్గించేందుకు తీసుకుంటున్న తాజా చర్య ఉద్యోగుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
ఇకపై కంపెనీ ఇచ్చే ఫోన్లను వ్యక్తిగత అవసరాల కోసం ఎంతవరకు వాడుతున్నారో ఉద్యోగులు ప్రతినెలా నివేదిక రూపంలో అందించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనతో, ఫోన్ రీయింబర్స్‌మెంట్ నిబంధనలు (Phone Reimbursement Terms) మారనున్నాయి. ఉద్యోగుల వ్యక్తిగత వాడకం ఎక్కువైతే, నెలకు ఇచ్చే $50 రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని తగ్గించేందుకు అమెజాన్ (Amazon) యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. ఈ నిర్ణయం సీఈవో ఆండీ జాస్సీ ఆధ్వర్యంలో కంపెనీలో తీసుకుంటున్న పలు కఠిన చర్యల్లో భాగమే అని అమెజాన్ వివరిస్తోంది.
Amazon | కొత్త నిర్ణయాలు
బిజినెస్ ఇన్‌సైడర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫోన్ వాడకంపై నిఘా మాత్రమే కాకుండా, కంపెనీలో మైక్రో మేనేజ్‌మెంట్ (Micro Management) మరింతగా పెరిగింది. రిటైల్ విభాగం ఉద్యోగులు వ్యాపార పర్యటనకు వెళ్లాలంటే, ప్రయోజనాలు ఏమిటి, కంపెనీకి కలిగే లాభాలు, లక్ష్యాలు ఏంటన్నది ముందుగానే వివరించి అనుమతి తీసుకోవాలి. అలాగే భోజన ఖర్చుల వివరాలను కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఇదే నా సొంత డబ్బయితే నేను ఎలా ఖర్చుపెడతాను అని ప్రతి ఉద్యోగి ఆలోచించాలని ఆండీ జాస్సీ (CEO Andy Jassy) అందరికి సూచించారు.
ఈ కొత్త విధానం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. కంపెనీ అందించే ఫోన్‌ను సాధారణ వర్క్ బెనిఫిట్‌గా భావించే ఉద్యోగులు, ఇప్పుడు దాని వాడకంపై గట్టి నిఘా పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి చర్యల వల్ల ఉద్యోగ భద్రతపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ ప్రతినిధి ఈ పరిణామంపై స్పందిస్తూ, “ఈ చర్యలు ఆర్థిక క్రమశిక్షణ పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. వేగవంతమైన పనితీరు కలిగిన సంస్కృతిని పునరుద్ధరించడమే మా లక్ష్యం అని స్పష్టం చేశారు. ఒకవైపు వ్యయ నియంత్రణ, మరోవైపు ఉద్యోగుల నిబద్ధత పెంపుదల లక్ష్యంగా తీసుకుంటున్న ఈ చర్యలు.. సంస్థకు ఎంత వరకూ ఉపయోగపడతాయో గానీ, ఉద్యోగుల మానసిక స్థితిపై మాత్రం స్పష్టమైన ప్రభావం చూపుతున్నట్టు కనిపిస్తోంది.