అక్షరటుడే, కామారెడ్డి: Alumni Friends | తాము చదువుకున్న బడి కోసం పూర్వ విద్యార్థులు (Alumni Friends) ముందుకొచ్చారు. ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి, గురువులను సన్మానించడంతో వదిలేయకుండా బడి బాగు కోసం నడుం బిగించారు. ఈ మేరకు బడిలో విద్యార్థులను చేర్పించే బడిబాట బాధ్యత తమ నెత్తికెత్తుకున్నారు. పాల్వంచ (Palwancha) మండలం ఫరీద్‌పేటలోని (Faridpet) ప్రభుత్వ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు గురువారం గ్రామంలో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ పిల్లలను బడిలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. పాఠశాలలో అందిస్తున్న విద్య, మౌలిక వసతులు వివరించారు.
ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థి అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శంకర్ మాట్లాడుతూ.. తాము చదువుకున్న బడిని బాగుచేయడం ప్రతి పూర్వ విద్యార్థి బాధ్యత అని అన్నారు. ‘మన ఊరు–మనబడి–మన బాధ్యత’ నినాదంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పల్లె రమేష్ గౌడ్, ఎంఈవో రామ్మోహన్ రావు, సీఐ వెంకట రాజాగౌడ్, కొంగల వెంకట్, రాజు, దీపక్ గౌడ్, వెంకట్ రాములు, చిన్నయ్య, బాలరాజు, గోపాల్ రెడ్డి, సాయి రెడ్డి, శ్రీకాంత్, బాలరాజు గౌడ్, ఎల్లాగౌడ్, సురేష్, నాగరాజు, సత్యం రెడ్డి, వీర చారి, లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.