Homeతాజావార్తలుTelangana Congress | ఒంటరైన రేవంత్! సహకరించని మంత్రులు, ఎమ్మెల్యేలు..

Telangana Congress | ఒంటరైన రేవంత్! సహకరించని మంత్రులు, ఎమ్మెల్యేలు..

సీఎం రేవంత్​రెడ్డి పనితీరులో వేగం మందగించింది. పాలన వ్యవహారాలపై దృష్టి తగ్గినట్లు కనిపిస్తోంది. మంత్రులు, సొంత ఎమ్మెల్యేలే గీత దాటుతుంటే చేష్టలూడిగి చూడాల్సి వస్తోంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Congress | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన పట్టు లేకుండా పోయిందా? మంత్రులు, ఎమ్మెల్యేలపై అజమాయిషీ కరువైందా? ముఖ్యమంత్రికి హైకమాండ్ కళ్లెం వేస్తోందా? స్వేచ్ఛగా పని చేసుకోకుండా ఆంక్షలు విధిస్తోందా? అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది.

అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సరికొత్త జోష్ తో పని చేశారు. పాలనను పరుగులు పెట్టించారు. ఆరు గ్యారంటీల్లో ఒక్కొక్కటి అమలు చేయడం ప్రారంభించారు. అలాగే, గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు ఆదేశించారు. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లు వంటి వాటిపై దర్యాప్తు చేయించేందుకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఏడాది తిరిగిందో లేదో సీఎం పనితీరులో వేగం మందగించింది. పాలన వ్యవహారాలపై దృష్టి తగ్గినట్లు కనిపిస్తోంది. మంత్రులు, సొంత ఎమ్మెల్యేలే గీత దాటుతుంటే చేష్టలూడిగి చూడాల్సి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధినాయకత్వమే దీనికంతటికీ కారణమన్న ప్రచారం జరుగుతోంది.

Telangana Congress | అనతి కాలంలోనే ఎదిగి..

తెలంగాణ (Telangana) వచ్చిన తర్వాత రాష్ట్రంలో కనుమరుగవుతున్న కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించి, అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత కచ్చితంగా రేవంత్ రెడ్డికే దక్కుతుంది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా తొక్కి పడేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ముఖ్య నేతలను గులాబీ గూటికి చేర్చుకున్నారు. శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడమే కాదు, హస్తం పార్టీ అడ్రస్ లేకుండా చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, అప్పటిదాకా టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తన వాగ్దాటితో కేసీఆర్ ప్రభుత్వాన్ని(KCR Government) ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీలో క్రమంగా ఎదిగారు. ఆయన దూకుడును చూసి హైకమాండ్ ఆయనను పీసీసీ చీఫ్ గా చేసి పార్టీ పగ్గాలు అప్పగించింది.

ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి.. అప్పటికే దాదాపు ఆనవాళ్లు కోల్పోయిన ఆ పార్టీని మళ్లీ నిలబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు, పాదయాత్రలతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చారు. హస్తం గూటికి చేరిన అనతి కాలంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు అందుకున్న రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ప్రభుత్వ బాధ్యతలు సైతం దక్కించుకున్నారు. ఎంతో మహామహులు ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీలో చేరిన రెండున్నరేళల్లోనే ఈ స్థాయికి ఎదిగారు.

Telangana Congress | పాలనలో దూకుడు..

సీఎంగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి పాలనపై తనదైన మార్కు వేయడానికి ప్రయత్నించారు. గత ప్రభుత్వ పెద్దలతో అంటకాగిన అధికారులను పక్కన పెట్టి తన టీంను బలోపేతం చేసుకున్నారు. ఎన్నికల ముందర ఇచ్చిన హామీల్లో కొన్నింటికీ శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన అక్రమాలపై విచారణలకు ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project), విద్యుత్ కొనుగోళ్లు, ఈకార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping)తో పాటు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతిపై దర్యాప్తు జరిపించారు. మరోవైపు, ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిపోయిన బీఆర్ ఎస్ ఇక లేవకుండా చేయడానికి ప్రయత్నించారు. ఆ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చారు. వీలు దొరికినప్పుడల్లా ప్రత్యర్థి పార్టీలపై విమర్శల దాడి చేస్తూ ప్రజల్లో చర్చకు తెర లేపారు. హైదరాబాద్ నగర చుట్టుపక్కల కబ్జాలను అరికట్టడానికి, అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి హైడ్రా (Hydraa) తీసుకొచ్చారు. కొత్త రేషన్ కార్డులు, మహిళలకు ఫ్రీ బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, రూ.500లకే వంట గ్యాస్ వంటి హామీలు అమలు చేశారు.

Telangana Congress | కొరవడిన సహకారం..

అధికారం చేపట్టిన తొలి ఏడాదిలో మంచి మార్కులు సాధించిన రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ (Party High Command) కళ్లెం వేయడం ప్రారంభించింది. ఎక్కడికక్కడ ఆంక్షలు విధించడం మొదలైంది. ఆర్థికంగా ఎన్ని అవాంతరాలు ఎదురవుతున్నా పాలనను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న రేవంత్ రెడ్డి వేగానికి కళ్లెం వేసింది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చీటికి మాటికి ఢిల్లీకి వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పథకాల అమలు మొదలు ప్రభుత్వ విధాన నిర్ణయాల వరకూ ఆయనకు సహకారం లేకుండా పోయింది. బీసీ రిజర్వేషన్లు (BC Reservations) సహా ఇతర హామీల విషయంలో రేవంత్ నే తప్పుబట్టే పరిస్థితిని కల్పించింది. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యలు రెచ్చిపోతున్నారు. ముఖ్యమంత్రిని తప్పుబట్టేలా ప్రకటనలు చేస్తున్నారు.

Telangana Congress | అండగా నిలిచే వారేరి?

మరోవైపు, ముఖ్యమంత్రి వైఖరిపై మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి చెలరేగుతోంది. అభివృద్ధి పనుల మంజూరుతో పాటు నిధులు ఇవ్వడం లేదన్న అసహనం ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. మరోవైపు, కమీషన్లు, టెండర్ల వ్యవహారంలో మంత్రులు గుర్రుగా ఉన్నారు. గీత దాటుతున్న వారి విషయంలో ఏం చేయలేని స్థితిలో రేవంత్ రెడ్డి ఉండిపోయారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న వారిపై చర్యలు చేపట్టేందుకు వెనుకాడుతున్నారు. మంత్రులు బహిరంగంగానే రచ్చకెక్కి వీధి పోరాటాలకు దిగుతుంటే కట్టడి చేయలేక చేతులెత్తేశారు. మరోవైపు, బీఆర్ ఎస్ హయాంలో జరిగిన అవినీతి పర్వంలో అన్ని ఆధారాలున్నా.. సూత్రధారులను అరెస్టు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు.

ఇదే అదనుగా బీఆర్ ఎస్ (BRS) కూడా దూకుడు పెంచి, ముఖ్యమంత్రిని చిక్కుల్లో పడేసేందుకు ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ ఫిరాయింపులపై న్యాయ పోరాటం చేస్తోంది. నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు ఎక్కుపెడుతోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి అండగా నిలబడాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సొంత పార్టీ నేతలు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తమ సొంత ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఒంటరయ్యారన్న భావన ప్రజల్లోకి బలంగా వెళ్తోంది.