అక్షరటుడే, నిజాంసాగర్: Mahammad Nagar | మహమ్మద్ నగర్ మండలంలోని రైతులు చైతన్యం చాటారు. వృథాగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేశారు.
మండలంలోని నర్వ పాత చెరువు (Narva patha Cheruvu) తూము శిథిలావస్థకు చేరింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు అందులో నీరు వచ్చి చేరుతోంది. ఇదే సమయంలో తూము మరమ్మతులకు లోనైంది. ఈ విషయమై రైతులు పలుమార్లు అధికారులకు విన్నవించారు.
అయినప్పటికీ స్పందించకపోవడంతో బుధవారం రైతులంతా ఏకమయ్యారు. 400 ఎకరాల ఆయకట్టుకు నీరందించే పాత చెరువుకు వారే మరమ్మతులు చేసుకునేందుకు ముందుకొచ్చారు. రైతులంతా కలిసి ఇసుక బస్తాలను తూముకు అడ్డంగా వేసి వృథాగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేశారు. విలువైన సాగునీటిని కాపాడుకున్నారు. రైతులు చేసిన పనికి పలువురు శబాష్ అంటున్నారు. కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించారు.