అక్షరటుడే, బీర్కూర్ : Birkoor | పనులు చేయకుండానే తాను బిల్లులు తీసుకున్నానన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని.. నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీర్కూర్ మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ (Dronavalli Satish) అన్నారు.
బీర్కూర్ (Birkoor) మండలం బైరాపూర్ గ్రామంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోచారం వర్గీయులు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలే ముఖ్యమన్న భావనతో బైరాపూర్, సాంబాపూర్, మల్లాపూర్, నారాయణపూర్ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు.
Birkoor | అభివృద్ధిని ఓర్వలేకనే..
అభివృద్ధి కార్యక్రమాలను ఓర్వలేక పోచారం అనుచరులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సతీష్ మండిపడ్డారు. బైరాపూర్ గ్రామ (Bairapur Village) అభివృద్ధికి సుమారు రూ. 15 లక్షలు సొంత ఖర్చులతో పని చేశానని తెలిపారు. చెరువు ముందు రోడ్డు పనులకు రూ. 2.5 లక్షలతో పైపులు, ఫార్మేషన్, మొరం వేయించానని చెప్పారు. విఠలేశ్వర ఆలయానికి ధ్వజస్తంభం కోసం తనవంతుగా రూ. 2లక్షలు, రూ.11వేలు డాక్టర్ శ్రీనివాస్‌తో కలిపి ఖర్చు చేశానని స్పష్టం చేశారు. విఠలేశ్వర ఆలయానికి (Vitthaleshwara Temple) వచ్చిన రాజకీయ ప్రముఖుల సత్కారానికి, గుడి నిధులకు సంబంధం లేకుండా రూ. 4లక్షలు సొంతంగా వెచ్చించానని పేర్కొన్నారు. 32 డబుల్ బెడ్ రూం ఇళ్లకు ప్రహరీల కోసం రూ.1.5లక్షలు సొంతంగా ఖర్చు చేశారని తెలిపారు.
సొంత భూమిలో 13 మంది లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేలా అవకాశం కల్పించానని ద్రోణవల్లి సతీష్ పేర్కొన్నారు. వారిలో 12 మందికి ఒక్కొక్కరికి 100 బస్తాల సిమెంట్ ఇచ్చినట్లు వివరించారు. భక్తుల సౌకర్యార్థం నడకదారిపై షెడ్ నిర్మాణానికి రూ. 2.5 లక్షలు సొంతంగా, రూ.35 వేలు గుడి నిధులతో కలిపి ఖర్చు చేశానని వివరించారు. విగ్రహాల పునఃప్రతిష్ఠాపన సమయంలో బ్రాహ్మణ సేవల కోసం సొంతంగా రూ. 2లక్షలు, రూ.1.5 లక్షలు గుడి కమిటీ ద్వారా చెల్లించానని వివరించారు. శ్మశాన వాటికలో బోరు వేయించడం, చెరువులో మట్టి పూడిక తీసి మొరం వేయించడం వంటి పనులు తన ఆధ్వర్యంలో జరిగాయని చెప్పారు. శ్మశానవాటిక కోసం నాలుగు ఎకరాల భూమి కొనుగోలు చేసి, బిల్లులు లేపారన్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, దీనిపై పోచారం శ్రీనివాస్ రెడ్డిని బహిరంగంగా ప్రశ్నిస్తున్నానన్నారు. ఏదైనా బిల్లు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.

