అక్షరటుడే, భీమ్గల్: Panchayat Elections | జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat elections) నగారా మోగింది. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ (Armoor revenue division) పరిధిలోని 11 మండలాల్లో బుధవారం పోలింగ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. బాల్కొండ, భీమ్గల్, కమ్మర్పల్లి, మోర్తాడ్, ఆలూర్, మెండోరా, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, డొంకేశ్వర్, ఏర్గట్ల మండలాల్లో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Panchayat Elections | ఎన్నికల బరిలో నిలిచింది వీరే..
డివిజన్ వ్యాప్తంగా మొత్తం 165 సర్పంచ్ స్థానాలకు (Sarpanch seats) గాను 19 ఏకగ్రీవం కాగా, మిగిలిన 146 స్థానాలకు 562 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 1620 వార్డు స్థానాల్లో 490 ఏకగ్రీవం కాగా, మిగిలిన 1,130 వార్డులకు 3,382 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 3,06,795 మంది ఓటర్లు అభ్యర్థుల తలరాతను నిర్ణయించనున్నారు.
Panchayat Elections | పకడ్బందీగా ఏర్పాట్లు..
ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 1490 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 51 కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ సౌకర్యం కల్పించారు. 1,490 మంది పీవోలు, 2,278 మంది ఓపీవోలు విధుల్లో పాల్గొంటున్నారు. వీరికి తోడుగా 58 మంది మైక్రో అబ్జర్వర్లు, 38మంది జోనల్ అధికారులు పర్యవేక్షిస్తారు.
Panchayat Elections | ముగిసిన ర్యాండమైజేషన్ ప్రక్రియ
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎన్నికల పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో సోమవారం పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయింది. ఎన్ఐసీ హాల్లో నిబంధనల ప్రకారం కంప్యూటర్ ద్వారా సిబ్బందికి పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. ఈ కార్యక్రమంలో డీపీవో శ్రీనివాస్ రావు, నోడల్ అధికారి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Panchayat Elections | 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం..
ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2:00 గంటల నుండి ప్రారంభం కానుంది. ఫలితాల వెల్లడి అనంతరం విజేతల ప్రకటన ఉంటుంది. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఆయా మండలాల్లో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

