అక్షరటుడే, వెబ్డెస్క్ : Ministers Resign | గుజరాత్ (Gujarat) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ (BJP) ప్రభుత్వంలోని అందరు మంత్రులు గురువారం రాజీనామా చేశారు. సీఎం మినహా మిగతా మంత్రులు రాజీనామా సమర్పించారు.
గుజరాత్ మంత్రివర్గ విస్తరణను (Cabinet Expansion) శుక్రవారం చేపట్టనున్నారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు ముందు ప్రభుత్వంలోని మంత్రులందరూ రాజీనామా చేశారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ (CM Bhupendra Patel) మినహా అందరు రాజీనామాలు సమర్పించారు. ఆయన కేబినెట్లో 16 మంది సభ్యులు ఉన్నారు. తాజా విస్తరణలో 26 మందికి పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే పాత మంత్రుల్లో ఏడు నుంచి పది మందికి మరోసారి అవకాశం కల్పిస్తారని తెలిసింది. మిగతా పదవులను కొత్త వారికి ఇవ్వనున్నట్లు సమాచారం.
Ministers Resign | కీలక సమావేశం
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. అధిష్టానం సూచన మేరకు ఈ సమావేశంలో 16 మంత్రులు రాజీనామా చేశారు. వీరు తమ రాజీనామా పత్రాలను సీఎంకు అప్పగించారు. వాటిని ఆయన గురువారం రాత్రి గవర్నర్కు అందించనున్నారు. అయితే వీరిలో తిరిగి మంత్రులుగా నియమించాలనుకున్న వారి రాజీనామాలను గవర్నర్కు ఇవ్వబోమని బీజేపీ నేతలు పేర్కొన్నారు.
Ministers Resign | కొత్త కేబినెట్
గుజరాత్ కొత్త కేబినెట్ శుక్రవారం ఏర్పాటు కానుంది. రేపు ఉదయం 11.30 గంటలకు గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సమక్షంలో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేల మంత్రివర్గ కూర్పు ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాబోయే ఎన్నికలకు ముందు కుల, ప్రాంతీయ ప్రాతినిధ్యాన్ని సమతుల్యం చేయడానికి, కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి బీజేపీ ఈ నిర్ణయం చేపట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.