అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Assembly Sessions | అసెంబ్లీ సమావేశాలపైనే రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) నివేదికపై ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఆసక్తితో పాటు ఉత్కంఠ రేపుతోంది. శాసనసభ, మండలి సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి.
ఐదు రోజుల పాటు జరిగే ఈ భేటీలో కీలక అంశాలు చర్చకు రానున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదిక, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల(Local Body Elections)పై చర్చ జరిగే అవకాశముంది. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధికార, విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలు, తీసుకునే నిర్ణయాలపైనే అందరి దృష్టి నెలకొంది. దానికి తోడు బీసీ రిజర్వేషన్ల(BC Reservations)పై ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది.
Assembly Sessions | కాళేశ్వరంపైనే ప్రధాన చర్చ..
శాసనసభ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ సమావేశాలకు ఈసారి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై అసెంబ్లీ చర్చించనుంది. రూ.లక్ష కోట్లకు పైగా వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిపోయిన నేపథ్యంలో విచారణ జరిపిన కమిషన్ ఇటీవలే ప్రభుత్వానికి 600 పేజీల నివేదికను సమర్పించింది. రేవంత్ ప్రభుత్వం(Revanth Government) ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ జరుపనుంది. కాళేశ్వరం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), మంత్రులు హరీశ్‌రావు(Harish Rao), ఈటల రాజేందర్(Eatala Rajender)పై ఎటువంటి చర్యలకు సిఫారసులు చేస్తారన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
Assembly Sessions | కేసీఆర్ వస్తారా..?
కీలక అంశాలపై అసెంబ్లీ చర్చించనున్న నేపథ్యంలో ఇప్పుడు మరో అంశం కూడా ఆసక్తి రేపుతోంది. బీఆర్ ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు(Assembly Sessions)హాజరవుతారా? లేదా అన్నది చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రావడమే లేదు. కేవలం ప్రమాణ స్వీకారం చేసిన రోజు తప్పితే మళ్లీ ఆయన అసెంబ్లీ ముఖం చూడనే లేదు. సభకు వచ్చి చర్చల్లో పాల్గొనాలని, సలహాలు, సూచనలు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి ఎన్నిసార్లు సవాల్ విసిరినా కేసీఆర్ మాత్రం రాలేదు. అయితే, కాళేశ్వరం కమిషన్ తననే దోషిగా తేల్చిన తరుణంలో కేసీఆర్ ఈసారి సభకు వస్తారా? కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ఏవిధంగా సమర్థించుకుంటారు? ప్రభుత్వం నుంచి విమర్శలను ఏవిధంగా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే, కేసీఆర్ సభకు రావడం అనుమానమేనని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Assembly Sessions | బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు..
5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం నివేదికతో పాటు బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపైనా ప్రభుత్వం చర్చకు పెట్టే అవకాశమున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గతంలోనే తీర్ఆమనం చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపించింది. కానీ, అది అక్కడే పెండింగ్‌లో ఉంది. మరోవైపు సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు విధించిన గడువు సమీపిస్తుండడంతో ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలిసింది.