HomeజాతీయంElection Commission | ఈసీ సేవలన్నీ ఒకే గొడుగు కిందకు.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో ప్రారంభం..

Election Commission | ఈసీ సేవలన్నీ ఒకే గొడుగు కిందకు.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో ప్రారంభం..

ఎన్నికల సంఘం అందించే అన్ని సేవలు ఇక ఒక గొడుకు కిందకు రానున్నాయి. 40 రకాల సేవలను ఒకే యాప్​ ద్వారా అందించనున్నట్లు ఈసీ తెలిపింది. ఈ మేరకు ఈసీఐనెట్ యాప్​ను తీసుకొచ్చింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Election Commission | ఎన్నికల సంఘం అందించే సేవలన్నీ ఒకే గొడుకు కిందకు రానున్నాయి. ఈసీకి ఉన్న దాదాపు 40 ప్లాట్ ఫామ్లు, యాప్ లు కలిపి ఒకే యాప్ కింద సేవలందించనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly elections) సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభం కానుంది.

సోమవారం బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission).. రియల్ టైమ్ ఓటర్ల ఓటింగ్ శాతం అప్డేట్ల కోసం వన్-స్టాప్ డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రవేశపెట్టింది. బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ వో) నుంచి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు (సీఈవో) వరకు అన్ని విభాగాల అధికారులకు సింగిల్-విండో డిజిటల్ ఎకోసిస్టమ్గా ఉండాలనే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు.

Election Commission | ECINet యాప్ అంటే..?

ఎలక్షన్ కమిషన్ 40 ప్లాట్ ఫామ్ లు, యాప్ ల ద్వారా వివిధ రకాల సేవలందిస్తోంది. అయితే, వాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలని నిర్ణయించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ద్వారానే దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈసీఐనెట్ (ECINet) పేరిట తీసుకొస్తున్న ఈ యాప్ ను అన్ని యాప్ లకు ఇది తల్లిలాంటిదని సీఈసీ పేర్కొంది. ఎన్నికల్లో పారదర్శకతతో పాటు సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ నూతన ప్లాట్ ఫామ్ ను బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో ప్రారంభించనుంది. ఇది ఎన్నికల పర్యవేక్షణ, ఓటరు నిర్వహణ, కమ్యూనికేషన్, రిపోర్టింగ్ కోసం ఉపయోగించే ప్రస్తుత అన్ని డిజిటల్ సాధనాలను కూడా ఏకీకృతం చేస్తుంది.

Election Commission | ఎప్పటికప్పుడు సమాచార సేకరణ..

ఈ ప్లాట్ఫామ్ ఇప్పటికే ఉన్న 40 కంటే ఎక్కువ ఎన్నికల సంఘం యాప్లను (Election Commission apps) ఒకే ఇంటర్ ఫేస్లో విలీనం చేయగలదు. ఇది ఓటరు నమోదు, పోలింగ్ ఏర్పాట్లు, కౌంటింగ్ స్టేటస్ ను ట్రాక్ చేయగలదు. అలాగే ఈసీ హెల్స్ లైన్ నంబర్ (ECI helpline number) 1950తో అనుసంధానించబడుతుంది, వినియోగదారులు వారి BLOలతో నేరుగా కనెక్ట్ అవ్వడానికి వీలు కల్పిస్తుంది. ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు వేగంగా సమాచార సేకరణ అందుబాటులోకి వస్తుంది.

ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ రోజున ప్రతి రెండు గంటలకు ECINet యాప్లో ఓటింగ్ అవుట్ డేటాను అప్లోడ్ చేయవచ్చు. ఇది డేటాను నవీకరించడంలో జాప్యాన్ని తగ్గిస్తుంది. అన్ని డిజిటల్ కార్యకలాపాలు అధునాతన ఎన్క్రిప్షన్, యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ కింద రక్షణ లభిస్తుంది. ఎన్నికల ప్రక్రియలలో మాన్యువల్ ఎర్రర్స్, జాప్యాలను తగ్గించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.

Election Commission | లోపాల సవరణకు అవకాశం..

ECINet యాప్ ద్వారా ఓటర్ జాబితాలో సవరణలకు అవకాశం లభిస్తుంది. నామినేషన్ ప్రక్రియకు (nomination process) పది రోజుల ముందు వరకు ఏవైనా లోపాలను సరిదిద్దుకోవచ్చని, ఓటర్లు ముందుగా ఓటర్ల జాబితాలో తమ పేర్లను తనిఖీ చేసుకోవాలని ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. “ఓటర్లు ECINet ద్వారా తమ పోలింగ్ స్టేషన్ వివరాలను కూడా ధ్రువీకరించుకోవాలి. లేకపోతే వారి బూత్-లెవల్ అధికారులను సంప్రదించాలి. ఎవరైనా ఓటరు ECINet యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వారి EPIC నంబర్ (ఓటర్ ID నంబర్) నమోదు చేస్తే, BLO వివరాలు వస్తాయి..” అని సీఈసీ తెలిపారు. ఓటింగ్ వెబ్కాస్టింగ్ను సుప్రీంకోర్టు, హైకోర్టులతో పంచుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.