అక్షరటుడే, వెబ్డెస్క్ : Alia Bhatt | సినీ పరిశ్రమలో నెపోటిజం అంశం తరచూ చర్చకు వస్తూనే ఉంటుంది. వారసత్వ నేపథ్యం ఉన్నవారికే అవకాశాలు సులభంగా దక్కుతాయన్న విమర్శలు ఎప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటి ఆలియా భట్ (Alia Bhatt) తనదైన శైలిలో స్పందిస్తూ స్పష్టమైన అభిప్రాయం వెల్లడించారు. ఇండస్ట్రీలో (Industry) ఎవరు నిలబడాలి, ఎవరు బయటకు వెళ్లాలి అనే విషయాన్ని నిర్ణయించేది పూర్తిగా ప్రేక్షకులేనని ఆమె తేల్చి చెప్పారు.ఆర్ఆర్ఆర్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఆలియా భట్ ప్రస్తుతం ‘ఆల్ఫా’ (Alpha) అనే యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
Alia Bhatt | ప్రేక్షకులనే నిర్ణయిస్తారు..
ఈ క్రమంలో ఆమె ఇటీవల రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ సినిమాకు చేసిన కృషికి గాను అక్కడ ఆమెకు గోల్డెన్ గ్లోబ్స్ హారిజన్ అవార్డ్ లభించింది. ఈ సందర్భంగా ఆలియా తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్కు (India) ప్రాతినిధ్యం వహించడం తనకు ఒత్తిడి కాదని, అది గౌరవం, గర్వమని ఆలియా అన్నారు. బయట నుంచి ఎంత గొప్పగా కనిపించినా, ఆ గ్లామర్ చివరికి ఒక రాత్రి పిజ్జా తింటూ పైజామాలో ముగుస్తుందని నవ్వుతూ వ్యాఖ్యానించారు.
నెపోటిజం గురించి జరుగుతున్న చర్చలపై స్పందిస్తూ..ఇక్కడ ఎవరు ఉండాలి, ఎవరు వెళ్లాలో నిర్ణయించేది ప్రేక్షకులే. వాళ్లే అసలైన జడ్జెస్” అని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. కూతురు రాహా (Raaha) తమ జీవితాల్లోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయని తెలిపారు. ఇప్పుడు రాహా ‘అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు?’ అని అడిగే వయసుకు వచ్చిందని, అందుకే రోజూ ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతి ప్రయాణం భావోద్వేగంగా మారుతుందని చెప్పారు.
తల్లి అయినా, ప్రపంచాన్ని చుట్టి వచ్చినా, విజయాలు సాధించినా.. ఒక విషయంలో మాత్రం తనని తాను కోల్పోకూడదనుకుంటున్నానని, అదేంటంటే ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలనే తపన అని ఆలియా వెల్లడించారు.తన చిన్న వయసును గుర్తు చేసుకుంటూ.. 17–18 ఏళ్ల వయసులో భయం, సంకోచం లేకుండా ప్రతిదీ చేయాలనే ఉత్సాహం ఉండేదని చెప్పారు. కాలక్రమేణా విజయం, వైఫల్యం రెండూ తన ఆలోచనా ధోరణిని మార్చాయని, కొన్నిసార్లు ఫలితాల గురించి పట్టించుకోకుండా తనకు అన్నీ ఇచ్చిన ఆ 18 ఏళ్ల అమ్మాయిలా మళ్లీ ఉండాలనిపిస్తుందని భావోద్వేగంగా చెప్పారు.