Alia Bhatt
Alia Bhatt | అలియా భ‌ట్‌ని మోసం చేసి ఏకంగా అన్ని ల‌క్ష‌లు కొట్టేసిన పీఏ

అక్షరటుడే, వెబ్​డెస్క్: Alia Bhatt | బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భ‌ట్ (Alia Bhatt) గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. హిందీలో స్టార్ హీరోయిన్​గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సౌత్ సినిమాల్లో కూడా న‌టించ‌డానికి ఆస‌క్తి చూపుతుంది. ఆ మ‌ధ్య రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో చ‌ర‌ణ్​ స‌ర‌స‌న నటించి మెప్పించింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా కనిపించింది కొద్దిసేపే అయినా తన నటనతో ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. పెళ్లి త‌ర్వాత కూడా అలియా భ‌ట్ వ‌రుస సినిమాలు చేస్తూ సంద‌డి చేస్తుంది. అయితే అలియా భట్ మాజీ వ్యక్తిగత సహాయకురాలు వేదిక ప్రకాశ్ శెట్టి(Vedika Prakash Shetty) భారీ మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Alia Bhatt | ఇలా మోసం చేసింది..

2021 నుంచి 2024 మధ్యకాలంలో అలియా పీఏగా పని చేసిన వేదిక, ఆమెకు సంబంధించి ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు(Financial Documents), షెడ్యూల్స్, పేమెంట్ల బాధ్యతను నిర్వహించేది. అయితే, వేదిక నకిలీ బిల్లులు సృష్టించి అలియా సంతకాన్ని మార్ఫింగ్ చేసి దాదాపు రూ.77 లక్షలు మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వేదిక ప్రకాశ్ శెట్టి.. అలియా స్థాపించిన నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పని చేసే సమయంలో ఈ మోసాలకు పాల్పడింది. 2022 నుంచి నకిలీ బిల్లులతో (Fake Bills) మోసం చేసింద‌ని, ఈ మొత్తం తన స్నేహితుల బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ చేసి స్వయంగా వినియోగించుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

అలియా తల్లి, నటి మరియు దర్శకురాలు సోనీ రజ్ధాన్ ఈ ఏడాది జనవరి 23న ముంబై జుహు పోలీస్ స్టేషన్లో(Mumbai Juhu Police Station) వేదికపై ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు వేదికపై నమ్మకద్రోహం, మోసం, నేరపూరిత కుట్ర వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైన అనంతరం వేదిక పరారీలో ఉంది. పోలీసులు ఆమె కోసం రాజస్థాన్, కర్ణాటక, పూణె ప్రాంతాల్లో గాలింపు జరిపారు. చివరికి ఆమెను బెంగళూరులో పట్టుకుని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వేదిక పోలీసుల కస్టడీ(Police Custody)లో ఉంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి. సినిమా పరిశ్రమలో విశ్వాసం కీలకమైన అంశంగా భావించే సమయంలో జరిగిన ఈ ఘటన బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.