అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Winter | రాష్ట్రంలో గత మూడు రోజులుగా చలితీవ్రత విపరీతంగా పెరిగింది. సాయంత్రం ఆరు కాగానే వాతావరణం చల్లబడుతోంది. దీంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. అయితే రానున్న రోజుల్లో మరింత చలి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 11 నుంచి 19 వరకు చలి తీవ్రత పెరగనుంది. పది రోజుల పాటు ఉష్ణోగ్రతలు (Temperature) భారీగా పడిపోనున్నాయి. ముఖ్యంగా ఈ నెల 13 నుంచి 17 మధ్య చలి ప్రభావం అధికంగా ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలుచోట్ల 13 నుంచి 15 డిగ్రీల వరకు టెంపరేచర్లు పడిపోయాయి.
Winter | ఆ జిల్లాలకు అలెర్ట్
ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, జగిత్యాల, ఉమ్మడి మెదక్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీయనున్నాయి. ఈ జిల్లాల్లో 9 నుంచి 12 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మిగతా జిల్లాల్లో సైతం చలి అధికంగా ఉంటుందన్నారు.
Winter | గజ గజ..
ప్రస్తుతం చలి పెరగడంతో జనం గజగజ వణికి పోతున్నారు. ఉదయం 8 గంటల వరకు కూడా చలి అధికంగా ఉంటుంది. సాయంత్రం ఆరు కాగానే ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 11 నుంచి పది రోజుల పాటు శీతల గాలుల ప్రభావం ఉండనుంది. దీంతో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు రాత్రి పూట బయటకు వెళ్లొద్దు. స్వెటర్లు వేసుకొవడం, క్యాప్‌లు పెట్టుకోవడం చేయాలి.
