అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Srivani Darshan Tickets | తిరుమల(Tirumala)లో కొలువైన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనం కోసం దేశ నలుమూలలతో విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. భక్తుల రద్దీ మేరకు టీటీడీ అధికారులు(TTD Officers) ఏర్పాట్లు చేస్తారు.
తిరుమలో శ్రీవాణి దర్శన కోటా టికెట్లకు(Srivani Darshan Tickets) భారీగా డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం నిత్యం 1500 టికెట్లను జారీ చేస్తున్నారు. ఇందులో 500 టికెట్లను ఆన్‌లైన్‌లో, వెయ్యి టికెట్లను ఆఫ్‌లైన్‌లో జారీ చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10 వేల కంటే ఎక్కువ విరాళం ఇచ్చిన భక్తులకు ఈ టికెట్లు ఇస్తారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఈ టికెట్ల కోటాను రెండు వేలకు పెంచాలని టీటీడీ ఇటీవల నిర్ణయించింది. ఇప్పటికే శ్రీవాణి టికెట్లు పొందిన భక్తుల దర్శన వేళల్లో మార్పులు చేశారు. ఉదయం టికెట్ తీసుకున్న వారు సాయంత్రం దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశారు.
Srivani Darshan Tickets |మొత్తం ఆన్లైన్లోనే..
ప్రస్తుతం శ్రీవాణి దర్శన టికెట్లలో 500 మాత్రమే ఆన్‌లైన్‌లో జారీ చేస్తున్నారు. వెయ్యి టికెట్లను ఆఫ్‌లైన్‌లో ఇస్తున్నారు. ఇందులో రేణిగుంట విమానాశ్రయం(Renigunta Airport)లో కొన్ని, అన్నమయ్య భవన్ ఎదుట గల కౌంటర్లో కొన్ని టికెట్లు ఇస్తున్నారు. ఆన్లైన్ టికెట్లను మూడు నెలల ముందుగానే టీటీడీ విడుదల చేస్తోంది. అయితే ఆఫ్‌లైన్ టికెట్లు(Offline Tickets) భారీగా డిమాండ్ ఉంది. భక్తులు రాత్రి నుంచే టికెట్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉంటున్నారు.
దీంతో ఆఫ్‌లైన్ కోటాను కూడా ఏ రోజుకు ఆ రోజే ఆన్‌లైన్‌లో జారీ చేయాలని టీటీడీ యోచిస్తోంది. దీంతో భక్తులకు లైన్లలో వేచి ఉండే బాధలు తప్పుతాయని భావిస్తోంది. కోటా పెంచడంతో పాటు ఏ రోజుకు ఆ రోజు ఆన్‌లైన్‌లో టికెట్లు జారీ చేస్తే ఇబ్బందులు ఉండవని అధికారులు పేర్కొంటున్నారు. కాగా ఈ టికెట్ పొందిన భక్తులు క్యూలైన్లో వేచి ఉండకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు.