అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) తరలివస్తారు. నిత్యం భక్తుల రద్దీ ఉండే తిరుమల కొండలను రక్షించడానికి టీటీడీ (TTD) అనేక చర్యలు చేపడుతోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తూనే.. తిరుమలలో పర్యావరణ సంరక్షణకు టీటీడీ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కొండపైకి ప్లాస్టిక్ బాటిళ్ల (Plastic Bottles) నిషేధించారు. తాజాగా తిరుమలలో కాలుష్యం తగ్గించడానికి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
తిరుమల (Tirumala)కు భక్తులు రద్దీ పెరుగుతోంది. అయితే చాలా మంది ప్రైవేట్ వాహనాల్లో (Private Vehicles) కొండపైకి వస్తున్నారు. ఈ క్రమంలో కాలుష్యం పెరిగిపోతుంది. దీంతో టీటీడీ అధికారులు కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. నిత్యం సుమారు 8 వేలకు పైగా కార్లు కొండపైకి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఎక్కువ పొగ వచ్చే వాహనాలను తిరుమలకు అనుమతించకూడదని అధికారులు నిర్ణయించారు.
Tirumala | అలిపిరి నుంచి వెనక్కి..
అలిపిరి చెక్‌పోస్ట్ (Alipiri Checkpost) వద్ద వాహనాలు పొల్యూషన్‌ను అధికారులు తనిఖీ చేయనున్నారు. దీనికోసం ప్రత్యేక సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ర్యాండమ్‌గా కొన్ని వాహనాలను తనిఖీ చేయనున్నారు. ఎందుకంటే అన్ని వాహనాలను తనిఖీ చేయడం సాధ్యమయ్యే పని కాదు. దీంతో నిత్యం కొన్ని వాహనాలను చెక్ చేస్తారు. స్మోక్ మీటర్(Smoke Meter) ద్వారా వాహన ఉద్గారాలను పరిశీలిస్తారు. వాటి స్థాయి నాలుగు యూనిట్లకు మించి ఉంటే.. వెనక్కి పంపిస్తున్నారు. భక్తులు ముందుగానే తమ వాహనాల పొల్యూషన్ స్టేటస్‌ను తెలుసుకుంటే ఇబ్బంది ఉండదని అధికారులు సూచిస్తునారు.
Tirumala | ఎలక్ట్రిక్ బస్సులు
తిరుమలలో ప్రైవేట్ వాహనాలను నియంత్రించడానికి టీటీడీ అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో ఉచితంగా ధర్మ రథాలను భక్తుల కోసం నడుపుతోంది. కాలుష్యం తగ్గించడానికి పలు ఎలక్ట్రిక్ బస్సులను కూడా టీటీడీ వినియోగిస్తుంది. రానున్న రోజుల్లో ధర్మ రథాల కోసం పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులనే వినియోగించాలని టీటీడీ యోచిస్తోంది. అలాగే ఇటీవల ఆర్టీసీ బస్సుల్లో కూడా భక్తులకు ఉచిత రవాణా సౌకర్యాన్ని టీటీడీ ప్రారంభించింది. దీంతో ప్రైవేట్ వాహనాల సంఖ్య తగ్గి కొండపై కాలుష్యం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.