అక్షరటుడే, వెబ్‌డెస్క్:Tirumala | తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. మెట్ల మార్గంలో నడిచి చాలా మంది స్వామి వారిని దర్శించుకొని తరిస్తారు. అయితే మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు ఇచ్చే టోకెన్లను పలువురు దుర్వినియోగం చేస్తున్నారు. దివ్యదర్శనం టోకెన్లు ఇప్పిస్తానంటూ పలువురు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు భక్తులను దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ(TTD) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దివ్యదర్శనం టోకెన్ల పంపిణీ కౌంటర్‌ను మార్చింది.
Tirumala | భూదేవి కాంప్లెక్స్‌లోకి మార్పు..
శ్రీవారి దర్శనార్థం శ్రీవారి మెట్టువద్ద నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్(Bhudevi Complex)కు మార్చాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఈ నూతన కౌంటర్లు శుక్రవారం సాయంత్రం నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో అందుబాటులోకి రానున్నాయి. టోకెన్ల సంఖ్య ఆధారంగా ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపాదికన కేటాయించనున్నారు. దివ్యదర్శనం టోకెన్ పొందిన భక్తులు(Devotees) తమ ఆధార్ కార్డు చూపించి 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేసుకోవాలి. శనివారం శ్రీవారి దర్శనం నిమిత్తం శుక్రవారం సాయంత్రం దివ్య దర్శనం టోకెన్లు మంజూరు చేస్తారు. నిత్యం 5వేల దివ్య దిర్శనం టోకెన్లు జారీ చేస్తారు. ఇదే సమయంలో ఎస్ఎస్డీ టోకెన్ల(SSD tokens)ను కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంటర్లలో అందిస్తారు.
Tirumala | ఇబ్బందులు లేకుండా టోకెన్ల పంపిణీ
భక్తుల రద్దీ నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా టీటీడీ విజిలెన్స్(TTD Vigilance), సెక్యూరిటీ(Security), పోలీసులు(Police) సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో ఆదేశించారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్ల జారీ ప్రక్రియ సజావుగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించడానికి అధికారుల బృందాన్ని నియమించనున్నారు. టోకెన్ కౌంటర్ల దగ్గర ఇబ్బంది లేని వాతావరణం ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం పటిష్ట క్యూలైన్లను ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది.భక్తులకు అందించే అన్నప్రసాదాలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయా విభాగాధిపతులను టీటీడీ ఈవో సూచించారు. శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని ఆదేశించారు.