అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Railway Passengers | దేశంలో నిత్య కోట్లాది మంది ప్రజలు రైళ్లలో రాకపోకలు సాగిస్తారు. పేద, మధ్య తరగతి వారి ఎక్కువ శాతం తమ ప్రయాణాలకు రైళ్లను (Trains) ఎంచుకుంటారు. అయితే రైళ్లలో ప్రస్తుతం ఒక వ్యక్తి ఎంత మేర బరువున్న లగేజీ తీసుకు వెళ్లాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ అవి ఎక్కడ అమలు కావడం లేదు. తాజాగా రైల్వే శాఖ (Railway Department) కీలక నిర్ణయం తీసుకుంది. లగేజీ బరువుపై స్టేషన్లలో ప్రత్యేక నిఘా పెట్టాలని నిర్ణయించింది.
దేశంలోని చాలా రైల్వే స్టేషన్ (Railway Station)లలో సరైన సౌకర్యాలు లేవు. దీంతో లగేజీ బరువు గురించి ప్రస్తుతం రైల్వే శాఖ పట్టించుకోవడం లేదు. ప్రయాణికులు తమకు నచ్చినంత లగేజీని తీసుకు వెళ్తున్నారు. ఎయిర్‌పోర్టుల్లో మాత్రం ఈ నిబంధన పక్కాగా అమలు అవుతోంది. ఒక్కో ప్రయాణికుడు కొంత బరువు ఉన్న లగేజీని మాత్రమే ఉచితంగా తీసుకు వెళ్లే నిబంధన ఉంది. అంతకు మించిన వస్తువులు తీసుకు వెళ్లాలంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్టుల తరహాలో ప్రధాన రైల్వే స్టేషన్లలో లగేజీపై నిబంధనలు కఠినంగా అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
Railway Passengers | ఎంత లగేజీ తీసుకెళ్లొచంటే?
రైలు ప్రయాణికులు (Passengers) తాము ప్రయాణించే తరగతిని బట్టి లగేజీ తీసుకు వెళ్లొచ్చు. ఫస్ట్‌క్లాస్ ఏసీ ప్రయాణికులు 70 కిలోల లగేజీని తీసుకు వెళ్లడానికి అనుమతి ఉంది. ఏసీ 2-టైర్‌లో 50 కిలోల వరకు, ఏసీ 3-టైర్, స్లీపర్‌లో 40 కిలోల బరువు ఉన్న సామగ్రిని ఉచితంగా వెంట తీసుకు వెళ్లవచ్చు. సెకండ్ క్లాస్‌లో ప్రయాణం చేసే వారు 35 కిలోలు మాత్రమే తీసుకు వెళ్లడానిని అనుమతి ఉంది. దీనికి మించి తీసుకు వెళ్తే ఫైన్ వేస్తారు. అయితే ప్రస్తుతం ఎక్కడా ఈ నిబంధన అమలు కావడం లేదు. ఈ క్రమంలో రైల్వేశాఖ దేశంలోని పలు ప్రధాన స్టేషన్లలో తూకం యంత్రాలను ఏర్పాటు చేసి లగేజీ నిబంధన పకడ్బందీగా అమలు చేయాలని యోచిస్తోంది.
Railway Passengers | ఎయిర్‌పోర్ట్‌ల తరహాలో..
ప్రస్తుతం ఎయిర్‌పోర్టు (Air Port)ల్లో పరిమితికి మించి లగేజీ తీసుకు వెళ్తే అదనంగా ఛార్జీలు చెల్లించాలి. రైళ్లలో కూడా దీనిని అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రస్తుతం నిబంధన అమలు కాకపోవడంతో కొంత మంది ఎక్కువ మొత్తంలో లగేజీ తీసుకు వెళ్తున్నారు. దీంతో ఇతర ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ప్రధాన రైల్వే స్టేషన్లలో లగేజీ నిబంధన అమలు చేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ప్రయాణికులు ఆయా స్టేషన్లలో ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లపై తమ లగేజీ ఉంచాలి. పరిమితి మించి లగేజీ ఉంటే దానికి అధికారులు అధనంగా ఛార్జీలు వసూలు చేయనున్నారు. అయితే ఈ నిబంధన ఎప్పటి నుంచి అమలు చేస్తారనే దానిపై ఇంకా రైల్వే వర్గాలు స్పష్టతనివ్వలేదు.