అక్షరటుడే, వెబ్డెస్క్ : Ponnam Prabhakar | రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల (Road Accidents) నివారణకు కఠిన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.
రాష్ట్రంలో నిత్యం అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. చాలా వరకు రోడ్డు ప్రమాదాలు వాహనదారులు నిబంధనలు పాటించకపోవడంతోనే అవుతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడుపుతుండటంతో సైతం యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో భారీ జరిమానా విధిస్తున్నారు. మొదటి సారి దొరికితే రూ.పది వేలు, రెండో సారి పట్టుబడితే రూ.15 వేల ఫైన్ వేస్తున్నారు. అంతేగాకుండా కోర్టులు జైలుశిక్ష సైతం వేస్తున్నాయి. తాజాగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఎన్ఫోర్స్మెంట్ నిరంతరం ఉండేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కఠినతరం చేయాలన్నారు.
Ponnam Prabhakar | ప్రత్యేక బృందాలు
జిల్లా స్థాయిలో 33 బృందాలు, రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు భారీ జరిమానాతో పాటు వాహనాలు సీజ్ చేయాలన్నారు. రోడ్ సేఫ్టీ మంత్పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. చేవెళ్ల (Chevella)లో ఆర్టీసీ బస్సుపైకి కంకర లారీ దూసుకు రావడంతో 19 మంది చనిపోయారు. ఇటీవల నల్గొండ (Nalgonda)లో ఓ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. వరుస ప్రమాదాల నేపథ్యంలో మంత్రి సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది.