అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Police | మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇస్తున్నారు. నిత్యం డ్రంకన్ డ్రైవ్ (Drunk Driving) ప్రత్యేక తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తున్నారు.కొత్త సంవత్సరం సమీపిస్తోంది. దీంతో చాలా మంది న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి ప్లాన్లు చేసుకుంటున్నారు.
హైదరాబాద్ వంటి నగరాల్లో కొత్త సంవత్సర వేడుకలు (New Year Celebrations) ఘనంగా సాగుతాయి. అయితే ఈ వేడుకల్లో మద్యం ఏరులై పారుతుంది. మద్యం తాగి కొంత మంది యువకులు రోడ్లపై హంగామా చేస్తారు. డ్రంకన్ డ్రైవ్‌లతో ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటాయి. దీంతో హైదరాబాద్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు.
Hyderabad Police | నిత్యం తనిఖీలు
న్యూ ఇయర్ సమీపిస్తుండటంతో నగరంలో నిత్యం డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ (Banjara Hills)లోని టీజీ స్టడీ సర్కిల్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ (Hyderabad CP Sajjanar) పరిశీలించారు. తనిఖీలు జరుగుతున్న విధానాన్ని, సిబ్బంది పనితీరును పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారితో మాట్లాడి.. మద్యం తాగి వాహనాలు నడపడంతో కలిగే అనర్థాలను వివరించారు.
Hyderabad Police | అదనపు బలగాలతో..
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు సీపీ తెలిపారు. డిసెంబరు 31 రాత్రి వరకు నగరవ్యాప్తంగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్’ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏడు ప్లాటూన్ల అదనపు బలగాలతో హైదరాబాద్ కమిషనరేట్ (Hyderabad Commissionerate) పరిధిలోని 120 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనిఖీల్లో దొరికితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.