అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రాన్ని వానలు వీడడం లేదు. వర్షాకాలం ముగిసినా భారీ వానలు (Heavy Rains) పడతాయని అధికారులు పేర్కొన్నారు. ఈ వర్షాకాలం సీజన్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వానలు దంచికొట్టాయి.
భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే వర్షాకాలం ముగిసినా మళ్లీ వర్షాలు పడుతాయని అధికారులు చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి 10 వరకు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 11 నుంచి 20 మధ్య నైరుతి రుతుపవనాల ఉపసంహరణతో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. అక్టోబర్ 21 నుంచి 31 వరకు ఈశాన్య రుతుపవనాల రాకతో దక్షిణ, తూర్పు తెలంగాణ, ఆంధ్ర సరిహద్దులో వర్షాలు పడతాయి.
Weather Updates | వరుసగా ఆరో ఏడాది
ఈ వర్షాకాలంలో హైదరాబాద్ (Hyderabad) నగరంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. 897 మి.మీ. వర్షపాతం నమోదైంది. గత 20 ఏళ్లలో ఇదే రికార్డు స్థాయి వర్షపాతం కావడం గమనార్హం. వరుసగా ఆరో ఏడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సైతం వరుసగా ఆరో ఏడాది అధిక వర్షం కురిసింది. రాష్ట్రంలో వర్షాకాలం సీజన్లో 988.3 మి.మీ. వర్షపాతం నమోదు అయింది. సాధారణంతో పోలిస్తే ఇది 33 శాతం అధికం.
Weather Updates | రైతుల ఆందోళన
రాష్ట్రంలో భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆగస్టు 26, 27 తేదీల్లో కొన్ని జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. దీంతో రెండు లక్షలకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మరోవైపు నిత్యం వానలు పడుతుండడంతో పంటలకు తెగుళ్లు ఆశించాయి. మరోవైపు ముందస్తుగా సాగు చేసిన వరి పొలాలు కోతకు వచ్చాయి. వర్షాలు పడుతుండటంతో పంట కోతలపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.