అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala Brahmotsavam | తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy) దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది మంది తిరుమలకు వస్తారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో (Tirumala Srivari Temple) సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. దేశం నలుమూలల నుంచి స్వామి వారి దర్శనానికి నిత్యం భక్తులు వస్తుంటారు. అయితే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారు వివిధ వాహనాలపై భక్తులను అనుగ్రహిస్తారు. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు (TTD officials) ఏర్పాట్లు చేస్తున్నారు.
Tirumala Brahmotsavam | అంకురార్పణతో ప్రారంభం
తిరుమలలో ఈ నెల 23న సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో నిత్యం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు (vehicle services) ఉంటాయి. స్వామివారు ఆయా వాహనాలపై మాఢవీధుల్లో విహరిస్తూ.. భక్తులకు దర్శనం ఇస్తారు.
Tirumala Brahmotsavam | వాహన సేవల వివరాలు
- ఈ నెల 24న సాయంత్రం 05:43 – 6.15 గంటల మధ్య ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంపై స్వామివారు విహరిస్తారు.
- 25న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తారు.
- 26న ఉదయం సింహ వాహనం, మధ్యాహ్నం స్నపనం (పవిత్ర స్నానం), రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు ఊరేగుతారు.
- 27న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనంపై విహరిస్తారు.
- 28న ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం గరుడ వాహనంపై వేంకటేశ్వర స్వామి భక్తులను అనుగ్రహిస్తారు.
- 29న ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహన సేవలు ఉంటాయి.
- 30న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు దర్శనం ఇస్తారు.
అక్టోబర్ 1న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహన సేవలు ఉంటాయి. - 2న ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుంచి10 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.