అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | వానాకాలం సీజన్ ముగిసిన రాష్ట్రాన్ని వరుణుడు వదలడం లేదు. నిత్యం వర్షాలు పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇటీవల మొంథా తుపాన్ (Cyclone Montha) తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తుపాన్ ప్రభావంతో తెలంగాణ (Telangana)లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, సిద్దిపేట జిల్లాలో కుండపోత వానతో ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. వరంగల్, హన్మకొండ నీట మునిగి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. తుపాన్ ప్రభావం తగ్గడంతో గురు, శుక్రవారాల్లో వరుణుడు శాంతించాడు. దీంతో వానలు పోయాయని రైతులు సంబరపడ్డారు. కానీ వాతావరణ శాఖ అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఆదివారం నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని హెచ్చరించారు.
Weather Updates | నేడు పలు జిల్లాలకు వర్షసూచన
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వాతావరణం పొడిగా ఉంది. ఎండ బాగా రావడంతో అన్నదాతలు తడిసిన వడ్లను ఎంబబెట్టారు. అయితే శనివారం పలు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు పేర్కొన్నారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిద్దిపేట, భువనగిరి, నల్గొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం పడుతుందన్నారు. మిగతా ప్రాంతాల్లో చెదురుమొదురు వానలు కురిసే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు జల్లులు పడతాయి.
Weather Updates | అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రంలో రేపటి నుంచి మళ్లీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసేటప్పుడు చెట్ల కింద ఉండరాదని సూచించింది.
