అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రాన్ని వానలు వీడటం లేదు. నిత్యం జల్లులు పడుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం సైతం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు హెచ్చరించారు.
నాగర్కర్నూల్, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతాయి. మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో సాయంత్రం పూట వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు.
Weather Updates | రైతులకు గుడ్న్యూస్
వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు వాతావరణ శాఖ గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలు గురువారంతో ముగుస్తాయని తెలిపింది. అక్టోబర్ 10 నుంచి 13 వరకు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే 14 తర్వాత ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మళ్లీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రెండు రోజుల్లో అల్పపీడనంగా మారనుంది. దీంతో ఉత్తర కోస్తా, రాయలసీమలో గురువారం భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలో సైతం వానలు పడే అవకాశం ఉంది.
రాష్ట్రంలో వరికోతలు ప్రారంభం అయ్యాయి. రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. అయితే వరుణుడు రైతులతో దోబూచులాట ఆడుతున్నాడు. ఉదయం ఎండరాగానే అన్నదాతలు ధాన్యం కుప్పలు ఆరబోస్తున్నారు. అయితే ఒక్కసారిగా వర్షం వస్తుంది. దీంతో వడ్లు తడిసిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.