అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షం (Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు. ఉదయం నుంచే వాతావరణం మేఘావృతమై వర్షాలు పడుతాయి.
తెలంగాణలో మొన్నటి వరకు వరుణుడు కాస్త శాంతించడంతో రైతులు వరి కోతలు చేపట్టారు. అయితే రెండు రోజులుగా అక్కడక్కడ వర్షాలు పడుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పలు జిల్లాల్లో గురువారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో ఆరబెట్టిన ధాన్యం, మొక్కజొన్న తడిసిపోయి రైతులు ఇబ్బందులు పడ్డారు.
Weather Updates | ఆ జిల్లాల్లో..
తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో మధ్యాహ్నం, సాయంత్రం పూట మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. కాగా ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉంది. పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభం అయ్యాయి.
Weather Updates | ప్రారంభం కాని కొనుగోళ్లు
ప్రస్తుతం వానాకాలం వరికోతలు జోరుగా సాగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రైతులు (Farmers) పంట కోసి ఆరబోశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. అయితే ఇంకా ధాన్యం కొనుగోళ్లు మాత్రం ప్రారంభం కాకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో మాత్రమే ధాన్యం సేకరిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో వర్షం పడితే.. వడ్లు తడిసిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కోరుతున్నారు.
