అక్షరటుడే, వెబ్డెస్క్ : Tiruchanoor | తిరుచానూరులో కొలువు దీరిన పద్మావతి అమ్మవారి (Goddess Padmavati) వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) నవంబరు 17 నుంచి 25 వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని 11న (మంగళవారం) ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చాన, శుధ్ధి నిర్వహించనున్నారు.
పద్మావతి అమ్మవారి ఆలయంలో ఏటా బ్రహ్మోత్సవాలను టీటీడీ (TTD) వైభవంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం తిరుమంజనం చేపట్టనున్నారు. ఉదయం 6.30 నుంచి9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి భక్తులను సర్వ దర్శనానికి అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 11న, నవంబరు 17 నుంచి 25 వరకు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.
Tiruchanoor | ఉత్సవాల వివరాలు..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 17 నుంచి వివిధ రకాల వాహన సేవలు నిర్వహించనున్నారు. 17న ఉదయం ధ్వజారోహణం, రాత్రి చిన్నశేషవాహన సేవ, 18న పెద్ద శేషవాహనం, హంసవాహనం, 19న ముత్యపు పందిరి వాహనంపై అమ్మవారు విహరిస్తారు. 20న కల్పవృక్ష వాహన సేవ, హనుమంత వాహన సేవ ఉంటుంది. 21న పల్లకీ ఉత్సవం, గజవాహన సేవ, 22న సర్వభూపాల వాహనం, స్వర్ణరథం , గరుడవాహనంపై అమ్మవారు ఊరేగుతారు. 23న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, 24న రథోత్సవం, అశ్వ వాహన సేవ, 25న పంచమీతీర్థం, ధ్వజావరోహణం కార్యక్రమాలు చేపడుతారు.
