HomeజాతీయంSabarimala | శబరిమల వెళ్లే భక్తులకు అలెర్ట్​.. కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు

Sabarimala | శబరిమల వెళ్లే భక్తులకు అలెర్ట్​.. కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు

శబరిమలలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్పాట్​ బుకింగ్​ కోటాను భారీగా తగ్గించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sabarimala | శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. రద్దీని నియంత్రించడంలో అధికారులు విఫలం అయ్యారు. దీంతో స్వామి వారి దర్శనానికి 10 నుంచి 15 గంటల సమయం పడుతోంది.

క్యూలైన్​లలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఓ వృద్ధురాలు క్యూలైన్​లో ఊపిరాడక మృతి చెందింది. ఈ క్రమంలో కేరళ హైకోర్టు (Kerala High Court) రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజూ లక్ష మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నందున శబరిమల దేవస్వం బోర్డు కొన్ని ఆంక్షలు విధించాలని నిర్ణయించింది.

Sabarimala | స్పాట్​ బుకింగ్​ టోకెన్లపై ఆంక్షలు

శబరిమల అయ్యప్ప ఆలయానికి (Sabarimala Ayyappa Temple) భారీగా భక్తులు వస్తుండటంతో దర్శనం కోసం ఆంక్షలు విధించారు. రద్దీ కారణంగా, స్పాట్ బుకింగ్ ద్వారా రోజుకు 20 వేల మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. బుధవారం వరకు 30 వేల మందిని అనుమతించారు. అంతేగాకుండా 24వ తేదీ (సోమవారం) వరకు ప్రతిరోజూ 5 వేల మంది భక్తులను మాత్రమే స్పాట్ బుకింగ్ ద్వారా అనుమతిస్తారు. ఆ తర్వాత, ప్రతిరోజూ 20 వేల మంది భక్తులను అనుమతిస్తారు. అంతకు మించి భక్తులు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోకుండా వస్తే, వారికి మరుసటి రోజు మాత్రమే స్వామి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తారు.

Sabarimala | ఏడు బుకింగ్​ కేంద్రాలు

స్పాట్ బుకింగ్ విభాగానికి నీలక్కల్ (Nilakkal) ప్రాంతంలో 7 కొత్త బుకింగ్ కేంద్రాలను ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. అయ్యప్ప ఆలయ గర్భగుడి వద్ద క్యూ తగ్గితేనే భక్తులను నడక మండపంలోకి అనుమతిస్తారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న 70 వేల మంది భక్తులను ప్రతిరోజూ యథావిధిగా అనుమతిస్తారు. ఆలయం సమీపంలోని టాయిలెట్లను శుభ్రం చేయడానికి తమిళనాడు నుంచి 200 మంది పారిశుధ్య కార్మికులను రప్పించారు. దర్శనానికి చెల్లుబాటు అయ్యే వర్చువల్ క్యూ పాస్ తప్పనిసరి వెంట ఉంచుకోవాలని అధికారులు తెలిపారు. పాస్ లేకుండా నీలక్కల్ నుంచి శబరిమల (Sabarimala)కి ప్రవేశం లేదని స్పష్టం చేశారు.