Akhanda 2 Movie Review |
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, రచ్చ రవి తదితరులు
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: తమన్
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్ – సంతోష్
Akhanda 2 Movie Review | కథ:
రాయలసీమలోని ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న బాలమురళీకృష్ణ (బాలకృష్ణ) ప్రజల్లో గౌరవం పొందిన నాయకుడు. ఆయన కుమార్తె జనని (హర్షాలి మల్హోత్రా) చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను చూపిస్తుంది. కేవలం 17 ఏళ్లకే సైంటిస్ట్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించి దేశానికి గర్వకారణంగా నిలుస్తుంది. మరోవైపు, భారత్‌ను అస్థిరం చేయాలని చూస్తున్న చైనా, ఇందుకోసం మన దేశంలోని కపట రాజకీయ నాయకుడు ఠాకూర్ (కబీర్ సింగ్) సహకారాన్ని కోరుతుంది. అలా చైనాతో కలిసి భారత సనాతన ధర్మ మూలాలను ధ్వంసం చేసి దేశాన్ని లోపల నుంచే బలహీనపరచాలనే పన్నాగం పన్నుతాడు. అలాంటి సమయంలో అఖండ (బాలకృష్ణ) రంగ ప్రవేశం చేస్తాడు. నిజం–అసత్యం, ధర్మం–అధర్మం మధ్య జరిగే ఈ మహా సంగ్రామంలో అఖండ ఎలా ముందడుగు వేశాడు? జననిని, దేశాన్ని, ధర్మాన్ని ఎలా రక్షించాడు? అనేదే సినిమా కథ సారాంశం.
Akhanda 2 Movie Review | నటీనటుల పర్ఫార్మెన్స్:
బాలకృష్ణ పోషించిన ద్విపాత్రాభినయంలో అఖండ పాత్రే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అఖండగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ అన్నీ అదిరిపోయాయి. ముఖ్యంగా సనాతన ధర్మం, భక్తి, శక్తి సంబంధిత సంభాషణలు ప్రేక్షకులను బలంగా కనెక్ట్ చేస్తాయి. అయితే ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ పాత్ర మాత్రం ఆశించినంతగా లేదు. ఆ పాత్రకు అవసరమైన ఇంపాక్ట్ రాలేదు. సంయుక్త మీనన్ పాత్ర నిడివి తక్కువగానే ఉన్నప్పటికీ, పాత్రలోనూ, సినిమాలో ఉన్న ఒక్క పాటలోనూ ఆమె సరైన స్థాయిలో ఇమడలేకపోయింది. పాట కూడా కథలో సహజంగా మిళితమవకుండా కొంత బాహ్యంగా అనిపించింది.
విలన్ ట్రాక్ పరంగా చూస్తే.. ఆది పినిశెట్టి పాత్రను పూర్తిగా వినియోగించుకున్నట్లు అనిపించదు. అతడి పాత్ర ఉన్నట్లు కూడా సెకండ్ హాఫ్ వరకు పెద్దగా తెలియదు. చివరకు రెండు ఫైట్లతోనే అతని ట్రాక్ ముగించేయడం వల్ల అసలు విలన్ ఫీలింగ్ రాలేదు.“భజరంగీ భాయిజాన్” ఫేమ్ హర్షాలి మల్హోత్రా కూడా ఈ సినిమాలో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. లిప్ సింక్ పూర్తిగా మిస్ అయిపోవడం, హిందీలో నంబర్లు లెక్కపెడుతూ సీన్లు చేసేసినట్లుగా కనిపించడం పాత్రను సహజంగా కనిపించనీయలేదు. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ, డబ్బింగ్ వాయిస్ సరిపోకపోవడం వల్ల ఆమె పాత్ర బార్బీ బొమ్మలా మారింది. మురళీమోహన్, కబీర్ దుహాన్ సింగ్, శాశ్వత ఛటర్జీ, అచ్యుత్ కుమార్ తదితరులు మాత్రం తమ పాత్రలకు సముచిత న్యాయం చేశారు. అయితే అంతర్జాతీయ స్థాయిలో చూపించిన విలనిజం, దేశాలు దాటిన కుట్రలు ఇవేవీ సరిగా వర్కవుట్ కాలేకపోయాయి. ఆ ట్రాక్ కూడా కథలో పూర్తిగా కలిసిపోయిన భావన రాలేదు.
టెక్నికల్ పర్ఫార్మెన్స్:
మొదటి భాగానికి సంగీతంతో భారీ ప్లస్ పాయింట్‌గా మారిన తమన్, ఈ సీక్వెల్ విషయంలో అదే స్థాయి మ్యాజిక్‌ను పునరావృతం చేయలేకపోయాడు. ట్రాన్స్ బీజీఎం ఆకట్టుకున్నప్పటికీ, ఆర్.ఆర్. మాత్రం కొన్ని చోట్ల పునరావృతమైందనే ఫీలింగ్ కలిగిస్తుంది. కొత్త థీమ్‌లు, వైవిధ్యమైన సౌండ్ ప్యాటర్న్స్ ఉంటే మరింత బలంగా అనిపించేదని చెప్పాలి. యాక్షన్ విషయానికొస్తే రామ్–లక్ష్మణ్ మాస్టర్ల కంపోజిషన్లు సాంకేతికంగా చూసినప్పుడు ట్రోలింగ్‌కు గురయ్యే అవకాశం ఉన్నా, ఎమోషన్ సీన్స్‌లో మాత్రం థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ప్రత్యేకంగా ఇంటర్వెల్ బ్లాక్, అలాగే సెకండ్ హాఫ్‌లో వచ్చే రెండు శక్తివంతమైన ఫైట్లు గూస్బంప్స్ తెప్పిస్తాయి.
సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ మళ్లీ బాలయ్యను మాస్ యాంగిల్లో అద్భుతంగా క్యాప్చర్ చేశారు. యాక్షన్ సీన్స్‌ను విజువల్‌గా ఎలివేట్ చేస్తూ బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరింత బలోపేతం చేశారు. దర్శకుడు బోయపాటి యాక్షన్‌లో లాజిక్, సెన్సిబిలిటీ లేకుండా సినిమాలు చేస్తాడని అంటుంటారు. ఈ సినిమాలో కూడా అది కనిపించింది. హీరో దాదాపు దేవత్వం చేరిన శక్తిగా చూపించడంలో బోయపాటి క్రియేటివిటీ అర్థమైంది. శివుడు, హనుమంతుడు వంటి దైవిక అంశాలను కథనంలో ఉపయోగించిన తీరు బాగుంది. కానీ అఖండ 2లో బలమైన కోర్ పాయింట్, అలాగే శక్తివంతమైన విలన్ లేకపోవడం కథకు పెద్ద మైనస్‌గా మారింది. అఖండ ఎంట్రీలు, యాక్షన్ సీన్స్ తప్ప మిగతా భాగం మొదటి పార్ట్ స్థాయి ఇంపాక్ట్‌ను ఇవ్వలేకపోయింది.
కామెడీ విషయంలో బోయపాటి ట్రాక్ రికార్డు బలహీనమే. ఈ సినిమాలో కూడా కామెడీ సన్నివేశాలు, పంచులు అంతగా పనిచేయలేదు. అయినప్పటికీ, ప్రేక్షకులకు ఆ లోపం గమనించే సమయం ఇవ్వకుండా వరుసగా ఎలివేషన్స్, భారీ ఫైట్లతో పేస్‌ను కంట్రోల్లో ఉంచి సినిమాని వేగంగా నడిపించాడు బోయపాటి. అఖండ 2 ఆయన బెస్ట్ వర్క్ అని చెప్పలేం. కానీ దర్శకుడిగా, కథకుడిగా ప్రేక్షకులను ఎంగేజ్ చేయించడంలో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు.
ప్లస్ పాయింట్స్:
బాలయ్య అఖండ పాత్ర
సంగీతం
బోయపాటి డైరెక్షన్
మైనస్ పాయింట్స్
కామెడీ ట్రాక్, పంచులు
ఆది పినిశెట్టి పాత్ర
కథ వేగం
కొన్ని సన్నివేశాలు
విశ్లేషణ:
ఈ సినిమా గురించి చివరిగా చెప్పాల్సిన సంగతి ఒక్కటే.. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా హిందూ ధర్మం, పురాణాలు, మైథాలజికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సునామీ రేంజ్లో కలెక్షన్లు రాబడుతున్నాయి. ప్రత్యేకంగా నార్త్‌లో ఇలాంటి కంటెంట్‌కు వచ్చే రెస్పాన్స్ అసాధారణం. ‘అఖండ 2’ విషయంలో కూడా ఇదే మ్యాజిక్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
శివుడు, కుంభమేళా, అఘోరా, దైవిక శక్తుల వంటి ఎలిమెంట్స్‌కు ఉత్తరాదిలో వచ్చే కనెక్ట్ వేరే స్థాయిలో ఉంటుంది. అక్కడ మొదటి రోజు నుంచే పాజిటివ్ మౌత్‌టాక్ వస్తే, ఈ చిత్రం బాలయ్య కెరీర్లో మొదటి నిజమైన పాన్-ఇండియా హిట్‌గా నిలిచే అవకాశం ఉంది. అంతేకాదు బాలకృష్ణ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించే సినిమా అయ్యే ఛాన్స్ కూడా బలంగా కనిపిస్తోంది.