అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aishwarya Rajinikanth | సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఐశ్వర్యా రజనీకాంత్ కెరీర్ జర్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తొలుత ప్లేబ్యాక్ సింగర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య, ఆ తర్వాత క్రియేటివ్ రంగం వైపు అడుగులు వేసి దర్శకురాలిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు.
ధనుష్ హీరో (Hero Dhanush)గా తెరకెక్కిన ‘3’ సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన ఆమె, తొలి సినిమాతోనే డిఫరెంట్ అటెంప్ట్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.ఆ తర్వాత ‘వై రాజా వై’, ‘సినిమా వీరన్’, ‘లాల్ సలామ్’ వంటి చిత్రాలను తెరకెక్కించినప్పటికీ, దర్శకురాలిగా ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. చివరిగా దర్శకత్వం వహించిన ‘లాల్ సలామ్’ విడుదలై దాదాపు రెండేళ్లు పూర్తయ్యే దశకు చేరుకుంది.
Aishwarya Rajinikanth | క్రేజీ కాంబో..
అప్పటి నుంచి ఐశ్వర్య కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించలేదు. ఈ మధ్య కాలంలో భర్త ధనుష్‌తో ఏర్పడిన విభేదాలు, అనంతరం విడాకుల కారణంగా ఆమె ప్రొఫెషనల్ కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టలేకపోయినట్టు ప్రచారం జరిగింది. ఇటీవలే ధనుష్‌తో విడాకులు తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఐశ్వర్యా మళ్లీ తన కెరీర్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె కొత్త ప్రాజెక్ట్‌పై కోలీవుడ్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజాగా ఐశ్వర్యా రజనీకాంత్ (Aishwarya Rajinikanth) నటుడు విశాల్‌కు ఓ కథ వినిపించినట్టు సమాచారం. ఇది థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూపొందనున్న సినిమా అని టాక్. కథ నచ్చడంతో విశాల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఐశ్వర్యా ఈ స్క్రిప్ట్‌పైనే సీరియస్‌గా పని చేస్తున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా, విశాల్ (Actor Vishal) కూడా ఈ మధ్య కొత్త ప్రాజెక్ట్‌లకు ఎక్కువగా కమిట్ కాలేదు. ప్రస్తుతం ఆయన స్వీయ దర్శకత్వంలో ‘ముగుదం’, ‘డిటెక్టివ్ 2’ అనే రెండు సినిమాలు చేస్తున్నారు. బయట కథలు వినడం లేదా స్టార్ డైరెక్టర్లతో కొత్త సినిమాలు చేయడం విషయంలో విశాల్ కొంత గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఐశ్వర్యా కథపై ఆయన పాజిటివ్‌గా స్పందించడంతో ఈ కాంబినేషన్ నిజంగా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. నిర్మాణ పరంగా కూడా ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణంగా కథలు నచ్చితే విశాల్ బయట బ్యానర్లకు అవకాశం ఇవ్వకుండా తానే స్వయంగా నిర్మించే ప్రయత్నం చేస్తుంటాడు. మరోవైపు ఐశ్వర్యా కూడా తన సొంత బ్యానర్లోనే సినిమాలు నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ ప్రాజెక్ట్‌ను ఎవరు నిర్మిస్తారు అనే అంశం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.