అక్షరటుడే, వెబ్డెస్క్ : Delhi Pollution | దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వదలడం లేదు. రోజు రోజుకు గాలి నాణ్యత పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(Air Quality Index)పై 497 పాయింట్లు నమోదు అయింది.
ఢిల్లీలో వాయు కాలుష్యం (Delhi air pollution) పట్టి పీడిస్తోంది. అత్యంత పూర్ కేటగిరీలో గాలి నాణ్యత ఉండటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తీవ్ర కాలుష్యం నేపథ్యంలో పిల్లలకు సోమవారం నుంచి హైబ్రిడ్ విధానంలో పాఠశాలలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే గ్రాఫ్ ఫోర్ ఆంక్షలు అమలు చేస్తున్న ప్రభుత్వం, తాజాగా BS-4 డీజిల్ వాహనాలపై నిషేధ విధించింది. ఢిల్లీలోకి వచ్చే భారీ ట్రక్కులను నిషేధిస్తూ ఆంక్షలు అమలు చేస్తుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థ అయిన కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ శనివారం మధ్యాహ్నం GRAP-3 కింద ఆంక్షలను విధించింది. గాలి నాణ్యత వేగంగా క్షీణించడంతో ఆదివారం GRAP-4 కింద ఆంక్షలు అమలు చేస్తోంది.
Delhi Pollution | హైబ్రిడ్ విధానంలో పాఠశాలలు
పదో తరగతి మినహా 11వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తరగతులను హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం (Delhi government) ఆదేశించింది. కార్యాలయాలు కూడా భౌతిక హాజరును తగ్గించుకోవాలని కోరింది. 50 శాతం మంది సిబ్బంది ఇంటి నుంచి పని చేయాలని సూచించారు. ప్రైవేట్ సంస్థలకు వాహనాల రాకపోకలను అరికట్టడానికి పని గంటలను మార్చి మార్చి అమలు చేయాలని సూచించింది. గాలి నాణ్యత క్షీణించడంతో ప్రజలు ఆరోగ్యంపై ఆందోళన చెందారు. కళ్లలో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.