అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Air India | పైలట్ల కొరతతో ఇండిగో విమాన (Indigo Flights) సర్వీసులు కొన్నిరోజులుగా రద్దు అవుతున్న విషయం తెలిసిందే. ఏడు రోజులుగా నెలకొన్న ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
టాటా (TATA) ఆధ్వర్యంలోని ఎయిరిండియా కీలకపైలట్ల నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. B737, A320 విమానాల్లో పైలట్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎయిర్‌బస్ A320, బోయింగ్ 737 విమానాల కోసం అనుభవజ్ఞులైన పైలట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. “ఆకాశం పరిమితి కాదు, ఇది ప్రారంభం మాత్రమే” అని ఎయిర్‌లైన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Air India | 22 వరకు గడువు
అనుభవజ్ఞులైన B737, A320 పైలట్లను పెరుగుతున్న తమ విమానాల జాబితాలో చేరమని ఆహ్వానిస్తున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. డిసెంబర్ 22లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎయిర్‌లైన్ దాని A320 విమానాల కోసం కమాండ్‌లో అనుభవజ్ఞులైన ‘టైప్ రేటెడ్’ (Type rated) పైలట్ల కోసం వెతుకుతోంది. B737 విమానాల కోసం, అనుభవజ్ఞులైన ‘టైప్ రేటెడ్’ ‘నాన్-టైప్ రేటెడ్’ పైలట్లను నియమించుకోవడానికి ఎదురుచూస్తోంది. టైప్ రేటింగ్ అనేది విమానాలపై పరీక్ష, శిక్షణ పూర్తి చేసిన పైలట్ల సర్టిఫికేషన్‌కు సంబంధించినది.
Air India | కొత్త నిబంధనలతో..
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) గత సంవత్సరం జారీ చేసిన సవరించిన FDTL నియమాలు నవంబర్‌లో అమలులోకి వచ్చాయి. ఇండిగో కొత్త నిబంధనలు అమలు చేసిన తర్వాత సంక్షోభం నెలకొంది. సిబ్బంది కొరతతో అనేక విమానాలు రద్దయ్యాయి. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా తాజా నియామక డ్రైవ్ చేపట్టనుంది. కాగా సోమవారం సైతం ఇండిగో 500 విమానాలను రద్దు చేసింది. అదే సమయంలో 1,802 సేవలను నిర్వహిస్తామని హామీ ఇచ్చిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది.