అక్షరటుడే, వెబ్డెస్క్: President Murmu | భారతదేశం భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) అన్నారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో.. ఒడిశాలోని రాయగడ్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (Indira Gandhi National Open University) ప్రాంతీయ కేంద్రం, నైపుణ్య శిక్షణ కేంద్రంతో పాటు ‘స్కిల్ ది నేషన్ ఏఐ ఛాలెంజ్’ను వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, సమాజ నిర్మాణంలో ఏఐ ముఖ్యమైన భూమిక పోషిస్తుందన్నారు. ఉద్యోగాలు, సేవల రంగాలపై కూడా ఏఐ ప్రభావం ఉంటుందని వివరించారు. భారత లాంటి యువశక్తి గల దేశంలో ఏఐ కేవలం సాంకేతికతగా మాత్రమే కాకుండా, సమగ్ర పరివర్తన సాధనంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
President Murmu | సాంకేతికత అందిపుచ్చుకోవాలి
అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ద్వారా విద్యార్థులు తమను తాము సన్నద్ధం చేసుకోవడంపై రాష్ట్రపతి ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. తమ జ్ఞానం, నైపుణ్యాలను సమాజ సేవకు, సమస్యల పరిష్కారానికి వినియోగించాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఐ శిక్షణ మాడ్యూళ్లను పూర్తి చేసిన పార్లమెంటు సభ్యులను కూడా ఆమె అభినందించారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఏఐ ఒక ముఖ్య సాధనంగా పనిచేస్తుందని రాష్ట్రపతి అభిప్రాయం వ్యక్తం చేశారు. రానున్న దశాబ్దాల్లో జీడీపీ వృద్ధి, ఉపాధి అవకాశాలు, ఉత్పాదకత పెంపుదలలో ఇది కీలక పాత్ర నిర్వహిస్తుందన్నారు. డేటా సైన్స్, ఏఐ ఇంజినీరింగ్, డేటా విశ్లేషణ వంటి నైపుణ్యాలు జాతీయ స్థాయి ప్రతిభను రూపొందించడంలో ప్రధానమని చెప్పారు.